Share News

ఆటో సర్వీస్‌ డబ్బులు అడిగితే చంపేశాడు!

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:29 AM

Killed for Asking Auto Service Money! ఆటో సర్వీసు డబ్బులు చెల్లింపు వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కొండబుచ్చింపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

 ఆటో సర్వీస్‌ డబ్బులు అడిగితే  చంపేశాడు!
శ్రీనివాసరావు (ఫైల్‌)

  • వారం తర్వాత వెలుగులోకి..

  • నిందుతుడిని అరెస్టుచేసిన పోలీసులు

మక్కువ రూరల్‌, జూన్‌19(ఆంధ్రజ్యోతి): ఆటో సర్వీసు డబ్బులు చెల్లింపు వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కొండబుచ్చింపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కాగా శుక్రవారం నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కొండబుచ్చింపేట గ్రామానికి చెందిన మరడ శ్రీనివాసరావు (27), దత్తి అచ్యుతరావు మంచి స్నేహితులు. శ్రీనివాసరావు ఆటో తిప్పుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అచ్యుతరావుకు భాగస్వామ్య పద్ధతిలో నడిపేందుకు తన ఆటోను ఇచ్చాడు. సర్వీసుల ద్వారా వచ్చిన డబ్బులను చెరి సగం పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత అచ్చుతరావు ఆటో సర్వీసు డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12న శ్రీనివాసరావు ఇంటి మేడపై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన అచ్యుతరావు .. శ్రీనివాసరావును గోడ, వాటర్‌ట్యాంక్‌కు బలంగా కొట్టి.. మెడను గట్టిగా నొక్కి హతమార్చాడు. కాగా 13న తెల్లవారుజామున మేడపై శ్రీనివాసరావు విగతిజీవిగా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో లేదా మద్యం తాగి మరణించి ఉండొచ్చని అచ్యుతరావు అందర్నీ నమ్మించాడు. అయితే అంత్యక్రియల సమయంలో శ్రీనివాసరావు శరీరంపై ఉన్న గాయాలను గ్రామపెద్దలు, కుటుంబసభ్యులు గమనించారు. అచ్యుతరావు తీరుపై అనుమానం వచ్చి ప్రశ్నించడంతో అక్కడి నుంచి పర్యారయ్యాడు. వెంటనే శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్‌ మక్కువ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు అచ్యుతరావు రెండు రోజుల కిందట గ్రామపెద్ద కొట్నాన ధనంజయరావు ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అచ్యుతరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సాలూరు సీఐ రామకృష్ణ తెలిపారు. కాగా ఇంటికి చిన్నకొడుకైన శ్రీనివాసరావు అకాల మృతిని తల్లిదండ్రులు శివునాయుడు, సింహాచలమమ్మ జీర్ణించుకోలేక పోతున్నారు. చేతికందొచ్చిన బిడ్డ జ్ఞాపకాలను తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:29 AM