Share News

కిడ్నీ వ్యాధి వణికిస్తోంది

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:41 PM

Kidney Disease Is Causing Alarm గడసింగుపురం మరో ఉద్దానంగా మారుతోంది. ఈ గ్రామంలో రోజురోజుకూ కిడ్నీ బాధితులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఇక్కడ ఏడుగురు కిడ్నీ వ్యాధితో మరణించారు. ఈ గ్రామంలో మరికొందరు డయాలసిస్‌ స్టేజ్‌లో ఉన్నారు.

 కిడ్నీ వ్యాధి వణికిస్తోంది
గడసింగుపురం గ్రామం

  • ఇప్పటివరకు ఏడుగురి మృతి

  • డయాలసిస్‌ స్టేజ్‌లో మరో ఐదుగురు

  • కలుషిత నీరే కారణమంటున్న గ్రామస్థులు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): గడసింగుపురం మరో ఉద్దానంగా మారుతోంది. ఈ గ్రామంలో రోజురోజుకూ కిడ్నీ బాధితులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఇక్కడ ఏడుగురు కిడ్నీ వ్యాధితో మరణించారు. ఈ గ్రామంలో మరికొందరు డయాలసిస్‌ స్టేజ్‌లో ఉన్నారు. కాగా గడసింగుపురంతో పాటు పక్కనే ఉన్న సీమలవానివలస, కొత్తవలస, బొడ్డవలస గ్రామాల్లోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడంతో ఆయా ప్రాంతవాసులు భయందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- గడసింగుపురం గ్రామంలో ఇప్పటివరకు దొనక మూగేశ్వరరావు, మీనక గోపాల్‌, మీనక మజ్జి, బొమ్మాళి మల్లేశ్వరరావు, బొమ్మాళి కృష్ణ, బొమ్మాళి సింహాచలమమ్మ, దొనక కన్నయ్యలు కిడ్నీ వ్యాధితో మరణించారు. చనిపోయిన వారిలో తల్లీ కుమారుడు బొమ్మాళి సింహాచలమమ్మ కృష్ణ ఉన్నారు. 50 నుంచి 55 సంవత్సరాల లోపు వారే అత్యధికంగా ఈ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నట్లు ఆ గ్రామస్థులు వాపోతున్నారు. ఇంకా ఈ గ్రామంలో పువ్వల గౌరమ్మ, సాసుబిల్లి రాంబాబు, గరుగుబిల్లి శివరాం, దొనక రంగయ్య, దొనక గౌరమ్మ తదితరులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇందుకోసం వారు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. కాగా గడసింగుపురంలో స్ర్కీనింగ్‌ టెస్త్‌ చేస్తే ఇంకెంతమంది బాధితులు బయటపడతారోనని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.

- ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్న ఐదుగురిలో పువ్వల గౌరమ్మకు మాత్రమే రూ. 10 వేలు పింఛన్‌ వస్తోంది. మిగిలిన వారిలో దొనక రంగయ్య, గరుగుబిల్లి శివరాం, సాసుబిల్లి రాములకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు. దొనక గౌరమ్మకు అసలు పింఛన్‌ రావడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కొద్దిపాటి పింఛన్‌తో మందులు సరిగ్గా కొనుక్కోలేక, డయాలసిస్‌ చేయించుకోలేక వీరు నానా అవస్థలు పడుతున్నారు. పైగా రోజురోజుకీ వారి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసి వీరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- తమ గ్రామంలో కలుషిత నీరే కిడ్నీ వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణమని గ్రామస్థులు ఆరోపిస్తుండగా.. ఇటీవల ఆ ప్రాంతంలో నీటి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ భరత్‌చంద్ర తెలిపారు. ప్రాథమిక టెస్ట్‌లో అంతా బాగానే ఉందని, అయితే ఆ వాటర్‌లో ఏమైనా కెమికల్స్‌, ఫెస్టిసైడ్స్‌ కలిశాయేమోనన్న అనుమానంతో కాకినాడ ల్యాబ్‌కు కూడా శాంపిల్స్‌ పంపించామని వెల్లడించారు. రిపోర్టు వస్తే గాని ఏమీ చెప్పలే మన్నారు. దీనిపై జియ్యమ్మవలస పీహెచ్‌సీ వైద్యాధికారి సాయి ప్రసన్నను వివరణ కోరగా.. ‘గ్రామంలో చాలామంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇప్పటికే గ్రామంలో వాటర్‌ శాంపిల్స్‌ తీసుకున్నాం. రిపోర్ట్‌ వస్తే గాని ఏమీ చెప్పలేం. సోమవారం గ్రామంలో మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తాం. అందరికీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేస్తాం. ’ అని తెలిపారు.

- వ్యాధిగ్రస్థులను పూర్తిస్థాయిలో ఆదుకోవడంతో పాటు గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు జరిపి కిడ్నీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం కార్యదర్శి కె.గంగునాయుడు, కె.సీతారాం డిమాండ్‌ చేశారు. లేకుంటే కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Updated Date - Apr 18 , 2026 | 11:41 PM