Share News

కంచెడివలసలో కిడ్నీ వ్యాధి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:01 AM

మండలంలోని కొయ్యానపేట పంచాయతీ కంచెడివలస గ్రామాన్ని కిడ్నీ వ్యాధి పట్టిపీడిస్తోంది.

 కంచెడివలసలో కిడ్నీ వ్యాధి
కిడ్నీ బాధితులు రామకృష్ణ, నరసమ్మ, సింహాచలం, సాంబమూర్తి

- రెండేళ్లలో నలుగురి మృతి

- మరో ఐదుగురిలో లక్షణాలు

- ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స

మక్కువరూరల్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొయ్యానపేట పంచాయతీ కంచెడివలస గ్రామాన్ని కిడ్నీ వ్యాధి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో పలువురు మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నామని బాధితులు వాపోతున్నారు. కిడ్నీ వ్యాధితో గత రెండేళ్లలో గ్రామానికి చెందిన బురిడి సీతమ్మ, పువ్వల వెంకటరమణ, తాడ్డి గంగునాయుడు, మింది గౌరమ్మ, చింతల సీతమ్మ మృతి చెందారు. ప్రస్తుతం పుట్నూరు సింహాచలం, గవర నరసమ్మ, రౌతు రామకృష్ణ, తాడ్డి సాంబమూర్తి కిడ్నీ వ్యాధికి మందులు వాడుతున్నారు. సింహాచలం ఇటీవల కిడ్నీ ఆపరేషన్‌ కూడా చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రౌతు రామకృష్ణకు రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. వీరంతా 50 ఏళ్లు పైబడిన వారే. విజయనగరం, పార్వతీపురం పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లి వైద్యం పొందుతున్నారు. గ్రామంలో ఇంతమంది కిడ్నీ బాధితులు ఉన్నా వెలుగులోకి రాకపోవడం విశేషం. గ్రామంలో నిత్యం వైద్యసేవలందిస్తున్న పీహెచ్‌సీ సిబ్బంది.. డాక్టర్లకు తెలియపరచలేదా? వైద్యులకు తెలిసినా మిన్నకుండిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు పట్టించుకోక పోవడం వలనే పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలను ఖర్చుచేసి చికిత్స చేయించుకుంటున్నామని బాధితులు అంటున్నారు.

తాగునీరే కారణమా?

కిడ్నీ వ్యాధికి తాగునీరే కారణమని గ్రామస్థులు అంటున్నారు. గతంలో మక్కువ తాగునీటి పథకం ద్వారా కుళాయిల నుంచి సరఫరా అయిన నీటిని తాగిన రోజుల్లో ఎటువంటి రోగాలు సోకలేదని, ఆ పథకం నుంచి నీటి సరఫరా ఆగిపోయిన తరువాత కొయ్యానపేటలో అధికారులు బోరు వేశారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నీటిని వినియోగిస్తున్నప్పటి నుంచితాము రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట భైరిపురం గ్రామం నుంచి క్యాన్ల ద్వారా తాగునీటిని తెచ్చుకుని వంటలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మక్కువ పీహెచ్‌పీ వైద్యులు ఎల్‌.శివాజిని వివరణ కోరగా.. ‘కంచెడివలసలో కిడ్నీ వ్యాధి విషయం నా దృష్టికి వచ్చింది. శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడుతాం. గతంలో ఈ గ్రామంలో మంచినీటి పరీక్షలు జరిగాయి. ఆ వివరాలు తాగునీటి విభాగం అధికారుల నుంచి తెప్పిస్తాం.’ అని అన్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పీఎంకే రెడ్డిని వివరణ కోరగా.. కంచెడివలస వెళ్లి పరిశీలిస్తానని తెలిపారు.

Updated Date - Feb 27 , 2026 | 12:01 AM