Share News

Paidithalli festival పైడితల్లి పండగకు అంకురార్పణ

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:56 PM

Kick-off for the Paidithalli festival

Paidithalli festival పైడితల్లి పండగకు అంకురార్పణ
పందిరి రాట వేస్తున్న ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు

పైడితల్లి పండగకు అంకురార్పణ

చదురుగుడి, వనంగుడి ఆలయాల వద్ద పందిరిరాట

అమ్మవారి భక్తులకు మాలధారణ

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడిమాంబ పండగకు అంకురార్పణ ప్రక్రియ వైభవంగా జరిగింది. గురువారం చదురుగుడి, వనంగుడి వద్ద పందిరి రాట వేసి ఉత్సవాల పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి మండల దీక్ష ప్రారంభమైంది. గణపతి పూజ అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఆశీస్సులతో మాల ధరించారు. అనంతరం భక్తులకు మాలధారణ చేశారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 9.30 గంటలకు చదురుగుడి వద్ద పందిరిరాట వేశారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య పందిరి రాట ప్రక్రియ వైభవంగా జరిగింది. 11 గంటలకు రైల్వే స్టేషన్‌ రోడ్డులోని వనంగుడి వద్ద పందిరిరాట ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పైడిమాంబ ఉత్సవాల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, పైడిమాంబ సిరిమానోత్సవానికి పందిరిరాటతో అంకురార్పణ చేశామని, పండుగ వాతావరణంలో అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రూ.55 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఆలయ విస్తరణ తరువాత సిరిమానోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తామన్నారు. ఇరుకుగా వుండే ఆలయాన్ని విస్తరణ పనులతో విశాలంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కె.తామేశ్వరరావు, కె.ఆనందరావు, ఎల్‌.కుమారి, ఈ.వెంకట లక్ష్మీ, డికృష్ణమూర్తి రాజు, పి.రామయ్య పంతులు, ఎల్‌.స్వాతి, కె.తులసీ, కె.పద్మావతి, కె.గోపాలరెడ్డి, రమణ, నగర ప్రముఖులు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:57 PM