Kharif in danger ప్రమాదంలో ఖరీఫ్
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:17 AM
Kharif in danger జిల్లాలో ఖరీఫ్ ప్రమాదంలో పడింది. వరుణుడి జాడ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల్లో ఉన్న నీరు కూడా ఆవిరైంది. మండుతున్న ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉబాలు పూర్తిచేసిన పొలాల్లో సైతం నీరు లేకుండాపోతోంది.
ప్రమాదంలో ఖరీఫ్
జిల్లా వ్యాప్తంగా వర్షాభావం
ఇప్పటివరకూ 41 శాతమే సాగు
రిజర్వాయర్లు, కాలువల పరిధిలో మాత్రమే ఉబాలు
ఎండ తీవ్రతకు ఎండిపోతున్న పొలాలు
ఆందోళనలో రైతులు
జిల్లాలో ఖరీఫ్ ప్రమాదంలో పడింది. వరుణుడి జాడ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల్లో ఉన్న నీరు కూడా ఆవిరైంది. మండుతున్న ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉబాలు పూర్తిచేసిన పొలాల్లో సైతం నీరు లేకుండాపోతోంది. ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో మే చివరి వారంలో వర్షాలు పడ్డాయి. కానీ జూన్‌లో మందగించాయి. జూలైలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వర్షపాతం నమోదైంది. వర్షాలు కురిసే రోజుల మధ్య అధిక వ్యవధి ఉండడంతో పొలాల్లో నీరు కాస్త ఇంకిపోయింది. ఉబాలు వేసిన పొలాల్లో నేల నెర్రెలిచ్చింది. వరినారు మడులు కూడా ఎండిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ ఖరీఫ్‌లో అన్నిరకాల పంటల సాగు 45 శాతం మాత్రమే మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
విజయనగరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వర్షాల జాడ లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఆకాశం మేఘావృతం కావడం, తరువాత ముఖం చాటేయ్యడం పరిపాటిగా మారింది. దీనికితోడు విపరీతమైన ఎండ, ఆపై ఉక్కపోతతో పుడమి తల్లి ఉడికిపోతోంది. దీంతో పొలాల్లో నేల సైతం బీటలు వారుతోంది. జిల్లాలో అన్నిరకాల పంటలు కలిపి 2,40,000 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు చెబుతు న్నాయి. ఇందులో ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న పండిస్తున్నారు. చెరకు కూడా సాగుచేస్తున్నారు. అయితే వర్షాలు లేక ఇప్పటివరకూ కేవలం 80,000 ఎకరాల్లోనే రైతులు సాగుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాలు వలు, రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లోనే సాగు చేపడుతున్నారు. వ్యవసాయ పంపు సెట్లు ఉన్నచోట ఉబాలకు సిద్ధపడుతున్నా మండుతున్న ఎండతో నీరు ఇంకిపోతోంది. దీంతో రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,00251 హెక్టార్లు. కానీ ఇప్పటివరకూ కేవలం 41 శాతం మాత్రమే ఉబాలు పడ్డాయి. గత ఏడాది 61,575, హెక్టార్లలో ఉబాలు( 70 శాతం) పనులు జరిగాయి. మొక్కజొన్న సాగు విషయంలో ఫర్వాలేదు. సాధారణ సాగు విస్తీర్ణం 12,386 హెక్టార్లు కాగా..9181 హెక్టార్లల్లో పూర్తిచేయగలిగారు. అయినా వర్షాభావం తలెత్తడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. చాలా మండలాల్లో వర్షపాతం లోటు కనిపిస్తోంది. కాగా ఇంకా ఖరీఫ్‌లో వరి సాగుకు సమయం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.