Keeping Folk Arts Alive! జానపద కళల ఊపిరి నిలిచేలా!
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:45 PM
Keeping Folk Arts Alive! జానపదాలకు ప్రఖ్యాతిగా మన్యం బాసిల్లుతోంది. ఽథింసా నృత్యం, కోలాటం, కర్రసాము, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు , తప్పెటగుళ్ల ప్రదర్శనలతో జిల్లావాసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని జానపద కళలు చాలా వరకు కనుమరుగు అవుతున్నాయి. నేటి యువత కూడా వాటిపై ఆసక్తి చూపించడం లేదు. అయిన ప్పటికీ జిల్లాలో ఎంతోమంది కళాకారులు తమ కళా ప్రదర్శనలతో విశేష ప్రాచుర్యం పొందు తున్నారు.
థింసా, డప్పు వాయిద్యాలతో ప్రత్యేకత చాటుకుంటున్న గిరిజనులు
ప్రదర్శనలతో ఆకట్టుకంటున్న తప్పెటగుళ్ల కళాకారులు
నేడు అంతర్జాతీయ జానపద దినోత్సవం
జానపదాలకు ప్రఖ్యాతిగా మన్యం బాసిల్లుతోంది. ఽథింసా నృత్యం, కోలాటం, కర్రసాము, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు , తప్పెటగుళ్ల ప్రదర్శనలతో జిల్లావాసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని జానపద కళలు చాలా వరకు కనుమరుగు అవుతున్నాయి. నేటి యువత కూడా వాటిపై ఆసక్తి చూపించడం లేదు. అయిన ప్పటికీ జిల్లాలో ఎంతోమంది కళాకారులు తమ కళా ప్రదర్శనలతో విశేష ప్రాచుర్యం పొందు తున్నారు. ఎక్కడో మారుమూల ఉన్నా కూడా తమ ప్రతిభతో ప్రజాభిమానం పొందుతున్నారు. ప్రత్యేక రోజులు, పండుగలు, ఉత్సవాలు, శుభదినాల్లో పల్లె, పట్టణాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. కాలం మారుతున్నా కూడా కొన్ని జానపదాల వన్నె తగ్గలేదని నిరూపిస్తున్నారు. నేడు అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
గిరిజన సంస్కృతిలో వాయిద్యాలకు ప్రత్యేక స్థానం
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతిలో సంప్రదాయ వాయిద్యాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పాటు గ్రామ దేవతలు పండుగలు, అంత్యక్రియలు సమయంలోనూ గిరిజనులు ప్రత్యేకమైన వాయిద్యాలతో సందడి చేస్తుంటారు. ప్రధానంగా డప్పు, తుడం, కిన్నెర, సన్నాయి, తాళాలు, కర్రటిటికు, బాజ, కుండ, తాడికాయలతో తయారు చేసే వాయిద్యాలను లయబద్ధంగా వాయిస్తారు. ఇదే సమయంలో ఆ వాయిద్యానికి అనుగుణంగా గిరిజన మహిళలు సామూహిక థింసా నృత్యాలు చేస్తుంటారు. వివిధ సందర్భాలకు అనుగుణంగా సంప్రదాయ వాయిద్యాలను సైతం ఆదివాసీలు వాయిస్తుంటారు. కాగా వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వాయిద్య కళను నేటితరానికి అందించాలనే లక్ష్యంతో సీనియర్ కళాకారులు ముందుకు సాగు తున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు గిరిజన ప్రాంతాలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సంప్రదాయ వాయిద్యాలు, థింసా నృత్యాలతో స్వాగతం పలుకుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డప్పు, తుడం తదితర వాయిద్యాల తయారీని ఒడిశా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టే ఏపీ సర్కారు కూడా తగిన సహకారం అందించాలని గిరిజన కళాకారులు కోరుతున్నారు.
థింసా నృత్యానికి విశేష ఆదరణ
భామిని: మనుమకొండ గ్రామంలోని ఆదివాసీల సంప్రదాయ థింసా నృత్యానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. పురుషులు, మహిళలు వలకా కారంలో డప్పు వాయిద్యాల తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే ఈ నృత్యం ప్రత్యేక్ష ఆకర్షణగా నిలుస్తోంది. గిరిజన జీవన విధానం, ప్రకృతి, వ్యవసాయం, పక్షులు, జంతువులు అంశాలను ప్రతిబింభించే వివిధ రకాల స్టెప్పులు థింసా నృత్యానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. గిరిజన గ్రామదేవతలకు పూజిస్తూ సామూహికంగా డప్పు విధ్య హోరుతో బోడా థింసానృత్యం ప్రారంభమవుతుంది. చూడడానికి ఈ నృత్యం ఒకేలా ఉన్న అనేక రకాల స్టెప్పులు వేయడం త్రత్యేకత. రాళ్లను ఏరే నృత్యం, ఆకులు సేకరించే విధానంతో నాట్యం, పక్షుల నృత్యం, కమ్మర చెక్క వ్యవసాయం చేసేలా ఇలవారి జీవన విధానం అంతావిట్లో కలబోసి చెప్పడం దీని ప్రత్యేకత. సామూహిక థింసా నృత్యాలు కనుమరుగు అవుతున్న నేపథంలో పత్తిక చెలమయ్య 2009లో థింసా నృత్య ఆదివాసీ సవర సంస్కృతి బృందాన్ని ఏర్పాటు చేశారు. 20 మందితో కొనసాగుతున్న ఈ బృందం గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్, జమ్మూకాశ్మీర్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఐటీడీఏ, టీసీఆర్‌టీఎం ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలిచ్చారు. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నప్పటికీ సవర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని చెలమయ్య చెప్పారు.
తప్పెటగుళ్లు, కోలాటం ప్రదర్శనలతో..
పాచిపెంట రూరల్/వీరఘట్టం/సీతానగరం: పాచిపెంట మండలం మోసూరు, గవిరమ్మపేట, మాతుమూరు, కొత్తవలస, పాచిపెంట తదితర గ్రామాలతో పాటు వీరఘట్టం మండలం కడకెల్ల, సీతానగరం మండలంలోని గెడ్డలుప్పి, ఏగోటివలస గ్రామాల్లో తప్పెటగుళ్లు కళాబృందాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో ఆయా కళాకారులు ప్రదర్శనలిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. పాచిపెంట మండలంలోని గిరిజన ప్రాంతాల్లో థింసా నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రామాల్లో పండుగలు, శుభకార్యాలు జరిగినప్పుడు గిరిజనులు థింసా నృత్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక వీరఘట్టంలో 32 మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో కోలాటం ప్రదర్శనలిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏదేమైనా అంతరించిపోతున్న జానపద కళలను ప్రోత్సహించడంతో పాటు వాటిని పరిరక్షించాలని కళాకారులు కోరుతున్నారు.
కర్రసాముతో మెప్పిస్తూ..
పాలకొండ: శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కర్రసాము ఎంతగానో దోహదపడుతుంది. గతంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎంతోమంది ఈ కళను నేర్చుకునేవారు. ఎదుటవారు దాడి చేయడానికి చూస్తే క ర్రసాముతో నిలువరించే వారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ వేడుక జరిగినా కర్ర సాము లేకుండా జరిగేది కాదు. నాడు ఎంతో వైభవంగా వెలుగొందిన కర్ర సాము నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. పాలకొండలో గతంలో ఎంతో మంది కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం పట్టా అప్పలరాజు ఆధ్వర్యంలో పలువురు కోటదుర్గమ్మ ఉత్సవాల్లో కర్ర సాము చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు.