Kotadurga కరుణించమ్మా.. కోటదుర్గ
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:29 PM
Karuninchamma Kotadurga దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. అనంతరం దుర్గాదేవి అలంక రణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు.
అంబరాన్నంటిన దుర్గాష్టమి సంబరాలు
పాలకొండ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. అనంతరం దుర్గాదేవి అలంక రణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన అర్చకులు డి.లక్ష్మీ ప్రసాదశర్మ, మణీల్శర్మ భక్తులతో లక్ష పసుపు కొమ్ములతో పూజలు, పుష్పాభిషేకం, చండీదేవి పారాయణం, హోమాలు, పంచామృతాభిషేకం, కుంకుమ పూజలు చేయించారు. దుర్గాష్టమి నేపథ్యంలో పట్టణంలోని నక్కలపేట తదితర వీధులతో పాటు మండలంలోని డొంకలపర్త, కొండాపురం, ఎన్.కె.రాజపురం తదితర గ్రామాల నుంచి భక్తులు ఘటాలు, డప్పువాయిద్యాలు, పులివేషాలు, శక్తివేషాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ఘటాలు సమర్పించి పూజలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు సంబరాలు జరిపారు. ఈవో వి.వి.సూర్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ ఎం.రాంబాబు పర్యవేక్షణలో సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.చిన్నరాముడు, సబ్ కలెక్టర్ వవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా దేవదాయ శాఖాధికారి ఎస్.రాజారావు, ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కిషోర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.