Kakarlavalasa land dispute resolved amicably. కాకర్లవలస భూ వివాదం సుఖాంతం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:37 AM
Kakarlavalasa land dispute resolved amicably. కాకర్లవలస గిరిజనులకు ఊరట లభించింది. వారి భూ వివాదం పరిష్కారమైంది. భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని గిరిజనులు, ఆ భూములను కొనుగోలు చేశామని ఏపీఐఐసీ కొన్నాళ్లుగా వాదనలకు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం నడిచింది. ఎమ్మెల్యే బేబీనాయన రంగంలోకి దిగి మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు.
కాకర్లవలస భూ వివాదం సుఖాంతం
పరిష్కరించిన నేతలు, అధికారులు
ఆ భూములు ఏపీఐఐసీవని తేల్చిన రెవెన్యూ అధికారులు
గిరిజనులకు ప్రత్యేక పరిహారం మంజూరు
వారి భూముల అభివృద్ధికీ హామీ
కాకర్లవలస గిరిజనులకు ఊరట లభించింది. వారి భూ వివాదం పరిష్కారమైంది. భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని గిరిజనులు, ఆ భూములను కొనుగోలు చేశామని ఏపీఐఐసీ కొన్నాళ్లుగా వాదనలకు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం నడిచింది. ఎమ్మెల్యే బేబీనాయన రంగంలోకి దిగి మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. గిరిజనులకు కొంత పరిహారం ఇవ్వడంతో పాటు వారికి వాస్తవంగా ప్రభుత్వం కేటాయించిన భూములను అభివృద్ధి చేసేందుకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మంజూరైన పరిహారం కూడా తాజాగా అందుకున్నారు. దీంతో వివాదం పరిష్కారమైనట్లే.
బొబ్బిలి/ రామభద్రపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం మండలం మిర్తివలస గ్రామ పంచాయతీ కాకర్లవలస గిరిజన గ్రామంలో 187.12 ఎకరాలు కొన్నాళ్లుగా వివాదంలో చిక్కుకున్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ భూములను ఏపీఐఐసీ 2015లో కొనుగోలు చేసింది. అప్పటికి ఆ భూములన్నీ ఆ గ్రామానికి చెందిన గిరిజనుల స్వాధీనంలో ఉన్నాయి. ఈ విషయం ఏపీఐఐసీ అధికారులకు తెలియదు. అలాగే ప్రభుత్వం కేటాయించిన వాస్తవ భూములు ఎక్కడున్నాయో గిరిజనులకూ తెలియదు. ఎప్పటిలాగే వారంతా సాగుచేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీఐఐసీ అధికారులు ఆ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగారు. గత ఏడాది భూములను చదును చేసే చర్యలు చేపట్టారు. దీంతో గిరిజనులు కలవరపడ్డారు. ఆ భూములు తమ స్వాఽధీనంలో ఉన్నాయని, ప్రభుత్వం గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద 28 మందికి పట్టాలు ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వానికి రూ.కోట్లు చెల్లించి భూమిని కొనుగోలు చేశామని ఏపీఐఐసీ అధికారులు వాదించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
పోరుబాట
ఒకానొక సమయంలో ఏపీఐఐసీ అధికారులు ఆ భూమిలో చెట్లు కూల్చేసి పంటలను దున్నేసి చదును చేయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు సీపీఎం అండతో పోరాటాన్ని ఉధృతం చేశారు. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల ఎదుట పలు దఫాలు ఆందోళన చేశారు. ఏపీఐఐసీ అధికారులు చేపట్టే పనులను అడ్డుకున్నారు. దీనిపై అధికారులు, పోలీసులు వారిని పలుమార్లు బెదిరించారు. అయినా గిరిజనులు వెనుకంజ వేయలేదు. తమ భూములను అన్యాయంగా లాక్కుంటే జీవనం ఎలా అని, ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని గిరిజనులు భీష్మించారు.
ఎమ్మెల్యే చొరవ
గిరిజనుల ఆవేదనను గమనించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వివాదాన్ని పరిష్కరించాలని నిర్ణయించారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్, ఇతర పెద్దలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. పట్టాలు కలిగి ఉన్న ప్రతీ గిరిజన రైతుకు ఎకరాకు రూ.1.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించేలా ఒప్పందం చేశారు. అలాగే వారికి వాస్తవంగా కేటాయించిన భూములను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో గిరిజనులు శాంతించారు. తాజాగా వారందరికీ ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. దీంతో గిరిజనుల భూ సమస్య కథ సుఖాంతమైంది.
ఆనందాన్ని ఇచ్చింది
రేజేటి కుమారి, గిరిజన మహిళ
మేము సాగు చేసుకుంటున్న భూములను పరిశ్రమ ఏర్పాటు కోసం ఇచ్చేశారు. మాకు ఇచ్చిన పట్టాలు అక్కడే అని ఇన్నాళ్లూ అనుకున్నాం. ఎమ్మెల్యే చొరవతో ఎకరాకు రూ.లక్షా పాతికవేలు అందుకున్నాం. మాకు ఇచ్చిన పట్టా భూములను బాగు చేస్తామనడంతో ఆనందపడ్డాం.
పేదల కోసం ప్రభుత్వాన్ని ఒప్పించాం
బేబీనాయన, ఎమ్యెల్యే, బొబ్బిలి
పేదల కోసం ప్రభుత్వాన్ని ఒప్పించాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇందుకు సహకరించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద గిరిజనులకు ఇచ్చిన పట్టా భూములను సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం.