జిందాల్ భూ నిర్వాసిత రైతులకు న్యాయం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:53 PM
కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జిందాల్ భూనిర్వాసిత రైతులకు న్యాయం జరిగిందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు.
- విశాఖ ఎంపీ శ్రీభరత్
- అదనపు నష్టపరిహారం చెక్కుల పంపిణీ
శృంగవరపుకోట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జిందాల్ భూనిర్వాసిత రైతులకు న్యాయం జరిగిందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. లక్కవరపుకోటలోని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్యాసిత రైతులకు అదనపు నష్టపరిహారం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జిందాల్ భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం ఇప్పించిందన్నారు. ‘ఇరవై ఏళ్ల క్రితం భూ సేకరణ జరిగింది. అప్పటి నుంచి భూములు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో వివిద రకాల పరిశ్రమలు నిర్మించడ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ భావించారు. జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి అప్పట్లో భూములిచ్చిన రైతులకు అదనపు నష్టపరిహారం ఇచ్చేలా ఒప్పించారు. అది కార్యరూపం దాల్చంది. ఉద్యోగాలను ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు, నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు.’ అని అన్నారు. జేఎస్‌డబ్ల్యూ (జిందాల్) అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (ఏపీ, తెలంగాణ) రాచూరి కనకారావు మాట్లాడుతూ.. ఈ భూముల్లో 65 రకాల వేర్వేరు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు రానున్నట్లు చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఒక్కో రైతు కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు ఉద్యోగాలు సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. అదనపు నష్టపరిహారాన్ని వృథాగా ఖర్చు పెట్టవద్దని సూచించారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ.. ‘ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని రైతులు అప్పట్లో జిందాల్‌కు భూములు ఇచ్చారు. ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేసింది. రైతులకు అదనంగా ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పిస్తుంది. నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, తదితరులు పాల్గొన్నారు.