Just Ten Days Left… ఇంకా పది రోజులే..
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:38 PM
Just Ten Days Left… స్ర్తీనిధి రుణ లక్ష్యాలను చేరుకోవడంలో జిల్లా వెనుకంజలో ఉంది. ఇంకా పదిరోజులే గడువు ఉండడంతో ఆలోగా టార్గెట్ చేరుకుంటుందా? అన్నది ప్రశ్నార్థంకగా మారింది.
ఈ నెలాఖరు వరకే గడువు
జిల్లా టార్గెట్ రూ. 86.65 కోట్లు
ఇంతవరకు చెల్లించింది రూ. 77.8 కోట్లు
జియ్యమ్మవలస, మార్చి21(ఆంధ్రజ్యోతి): స్ర్తీనిధి రుణ లక్ష్యాలను చేరుకోవడంలో జిల్లా వెనుకంజలో ఉంది. ఇంకా పదిరోజులే గడువు ఉండడంతో ఆలోగా టార్గెట్ చేరుకుంటుందా? అన్నది ప్రశ్నార్థంకగా మారింది. జిల్లాలోని 15 మండలాల్లో 19,936 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. వాటిల్లో 2.38 లక్షల మందికి పైగా మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరికైనా తక్షణ రుణం కావాలంటే స్త్రీనిధి ద్వారా.. ఎటువంటి హామీ లేకుండా కేవలం రెండు నుంచి ఏడు రోజుల్లో వారి అకౌంట్లకు నగదు జమవుతుంది. అయితే జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో 8,675 మంది మహిళలకు రూ. 86.65 కోట్లు స్త్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వాలని వెలుగు సమాఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా మండలాల వారీగా టార్గెట్లు ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఈ టార్గెట్లు పూర్తి చేయాల్సి ఉంది. కాగా జిల్లాలో సీతంపేట, పాలకొండ మండలాల పరిధిలో లక్ష్యాలు దాటి స్త్రీనిధి రుణాలు మంజూరు చేశారు. ఇందులో సీతంపేట మండలంలో 23 మంది మహిళలకు రూ. 22 లక్షలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 74 మందికి రూ.37 లక్షల మేర రుణాలిచ్చారు. పాలకొండ మండలంలో 893 మంది మహిళలకు రూ. 8.92 కోట్లు ఇవ్వాలని నిర్దేశిస్తే 442 సంఘాల్లో 1144 మంది మహిళలకు రూ. 9.05 కోట్లు (101.46 శాతం) రుణాలుగా ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక నూటికి నూరు శాతం టార్గెట్లు పూర్తి చేసిన మండలాల్లో గరుగుబిల్లి (100.40 శాతం), కొమరాడ (100 శాతం), పార్వతీపురం (100 శాతం) మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో వీరఘట్టం (99.75 శాతం), సాలూరు (99.13 శాతం), మక్కువ (98.77 శాతం), కురుపాం (96.50 శాతం), సీతానగరం (87.78 శాతం), బలిజిపేట (79.64 శాతం), గుమ్మలక్ష్మీపురం (76.83 శాతం), పాచిపెంట (74.50 శాతం) మండలాలు ఉన్నాయి. భామిని (53.57 శాతం), జియ్యమ్మవలస (30.63 శాతం) మండలాలు లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. నామమాత్రంగా రుణాలు అందించి చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు మండలాల వల్ల జిల్లా లక్ష్యం 90 శాతం మించడం లేదు. ఇంకా పది రోజులే గడువు ఉన్నందున ఆలోగా జిల్లా రుణ లక్ష్యం నెరవేరేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్త్రీనిధి పథకం కింద ఇప్పటివరకు రూ. 77.80 కోట్ల మేర రుణాలు అందించగలిగారు. జియ్యమ్మవలస మండలంలో రూ.4.19 కోట్ల వరకు రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ రుణం తిరిగి వసూళ్లు శాతం ఈ మండలంలో 84 శాతం మాత్రమే ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో దీనిపై ఉన్నతాధి కారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ‘రుణాలు మంజూరు విషయంలో ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. త్వరగా ఆయా మండలాలు టార్గెట్ పూర్తి చేయడానికి ప్రయత్నిం చాలి.’ అని స్త్రీనిధి ఏజీఎం కామరాజు తెలిపారు.