Share News

Just switch on.. స్విచ్‌ ఆన్‌లోనే..

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:37 PM

Just switch on.. జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎక్కువ మంది ఏసీలను వినియోగిస్తున్నారు. ఏసీలు లేనివారు సైతం మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఫ్యాన్‌లను వాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమౌతున్నారు.

Just switch on.. స్విచ్‌ ఆన్‌లోనే..

స్విచ్‌ ఆన్‌లోనే..

పెరుగుతున్న విద్యుత్‌ వాడకం

అధిక ఉష్ణోగ్రతలే కారణం

పెరిగిన ఏసీల వినియోగం

రాత్రి పది నుంచి ఉదయం 5 గంటల వరకూ అధిక డిమాండ్‌

విజయనగరం /రింగురోడ్డు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎక్కువ మంది ఏసీలను వినియోగిస్తున్నారు. ఏసీలు లేనివారు సైతం మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఫ్యాన్‌లను వాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమౌతున్నారు.

ఎండ వేడి, ఉక్కబోతకు తట్టుకోలేక ఫ్యాన్‌లు, కూలర్లతో పాటు ఏసీలను వినియోగించడంతో విద్యుత్‌ డిమాండ్‌ అమాంతం పెరిగిపోతోంది. డిమాండ్‌కి అనుగుణంగా సప్లయ్‌ పెరగని పరిస్థితి. మరోవైపు అకాల వర్షం, గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడవుతున్నాయి. వీటన్నింటినీ సరిచేయడానికి విద్యుత్‌ శాఖ సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. జిల్లాలో మే, జూన్‌ నెలల్లో 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. 2025లో మే నెలలో 269.105 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించగా, ఈ ఏడాది మే నెలలో 322.01 మిలియన్‌ యూనిట్లు ఉపయోగించారు. జూన్‌ ఐదు రోజుల్లో 35 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ, రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము వరకూ విద్యుత్‌ వినియోగిస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది.

- జిల్లాలో 7 లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, వ్యవసాయం, ఇతర విద్యుత్‌ కనెక్షన్లు కలుపుకుని 7 లక్షల 27 వేల 520 వున్నాయి. ఇందులో గృహ కనెక్షన్లు 6 లక్షల 4 వేల 388, వాణిజ్య కనెక్షన్లు కేటగిరీ 2 కింద 67,323, కేటగిరీ-3 కింద 2,532, వ్యవసాయ కనెక్షన్లు కేటగిరీ- 4 కింద 14,460, కేటగిరీ-5 కింద 38,357తో పాటు హెచ్‌డీ కింద 460 కనెక్షన్లు వున్నాయి. గృహాలతో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సంబంధించిన కనెక్షన్లతో విద్యుత్‌ డిమాండ్‌, లోడ్‌ ఏటా పెరుగుతోంది. గత ఏడాది మే తో పోల్చుకుంటే ఒక్క మే నెలలోనే 53 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం పెరిగింది.

డిమాండ్‌ తగ్గట్టు సరఫరా

ఎం.లక్ష్మణరావు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌, విజయనగరం

పెరిగిన విద్యుత్‌ కనెక్షన్లు, వాటి డిమాండ్‌ దృష్టిలో వుంచుకుని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వేసవిలో డిమాండ్‌ పెరుగుతుంది. అయినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్‌ అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రజలు కూడా విద్యుత్‌ వినియోగం తగ్గించుకుంటే ట్రాన్స్‌ఫార్మర్‌పై భారం వుండదు. లోడ్‌ పెరిగితే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

===========

Updated Date - Jun 06 , 2026 | 11:37 PM