Just sort of dragging on...ఏదో అలా ‘సాగు’తూ..
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:11 AM
Just sort of dragging on... ఎల్‌నినో ప్రభావంతో వేసవిని తలపిస్తున్న ఎండలకు నారు ఎండిపోతుండడంతో ఆవేదన చెందుతున్న రైతులు ఇక ఏం జరిగితే అదే జరగని అనుకుని నాట్లుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు నెల వచ్చేటప్పటికి నాట్లు పూర్తిస్థాయిలో పడాలి.
ఏదో అలా ‘సాగు’తూ..
అదను దాటుతుండడంతో రైతుల పొలంబాట
దేవుడి భారం వేసి నాట్లుకు సన్నద్ధం
మోటార్లతో నీరు తోడుకుంటున్న వైనం
చాలా చోట్ల ఎండుతున్న నారు
ఈ ఖరీఫ్ సీజన్ కష్టాలతో మొదలైంది. వర్షాలు లేక.. నీటి వనరుల్లోనూ నిల్వలు కానరాక భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితిలో అన్నదాతలు ఉన్నారు. మరోవైపు నారు ముదిరిపోతుండడంతో దేవుడిపై భారం వేసి పొలంబాట పడుతున్నారు. నాట్లు వేసేందుకు అవసరమైన నీటిని దగ్గరలోని చెరువులు, నేలబావుల నుంచి మోటార్లతో తోడుకుంటున్నారు. వర్షాధారంపై వరిని వేయొద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా.. వరి సాగుకు విరామం ఇవ్వడానికి మనసు అంగీకరించడం లేదని, ఏం జరిగినా తట్టుకోవాలని నిర్ణయించుకున్నామంటున్నారు. ఆశ, నిరాశలతో ముందుకే వెళ్తున్నారు.
గజపతినగరం/ సంతకవిటి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):
ఎల్‌నినో ప్రభావంతో వేసవిని తలపిస్తున్న ఎండలకు నారు ఎండిపోతుండడంతో ఆవేదన చెందుతున్న రైతులు ఇక ఏం జరిగితే అదే జరగని అనుకుని నాట్లుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు నెల వచ్చేటప్పటికి నాట్లు పూర్తిస్థాయిలో పడాలి. కానీ పదిశాతం మాత్రమే వేశారు. అది కూడా నదులు, జలాశయాలు పక్కన ఉన్న వారే అధికంగా నాట్లు వేశారు. అయితే వరి నారు చాలా చోట్ల ఎండిపోవడంతో పాటు అదను దాటడంతో ముదిరిపోతోంది. వాటిని చూస్తున్న రైతులు బాధతో ఏమైనా సరే ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్న అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు. గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో గజపతినగరం మండలంలో 3691, బొండపల్లి 2558, దత్తిరాజేరు 3203, మెంటాడ 3422 హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1315హెక్టార్లలో మాత్రమే రైతులు వరిసాగు చేపట్టారు. జూన్ నుంచి జూలై 31వరకు జిల్లాలో 153.59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈకాలంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 258.29 మిల్లీమీటర్లుకాగా సుమారు 51.83ు లోటు వర్షపాతం నడుస్తోంది. గజపతినగరం మండలంలోని కాళంరాజపేట, లింగాలవలస, పిడిశీల, సీతారామపురం, శ్రీరంగరాజపురం తదితర గ్రామాల్లో కొందరు వరి నాట్లు ఎద పద్ధతిలోనూ, ఇంకొందరు సాధారణ పద్ధతిలోనూ వేశారు. రెండు చోట్లా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో తమ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
సంతకవిటి మండలంలో భిన్నంగా వరి పొలాలు
సంతకవిటి మండలంలో వరి పొలాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. మడ్డువలస రిజర్వాయర్ నుంచి గత నెల 24న సాగునీరు విడుదల చేయడంతో కాల్వలు ఉన్న మామిడిపల్లి, మోదుగు లపేట, పుల్లిట, తాలాడ, గరికపాడు, సురవరం తదితర గ్రామాల రైతులు ఉబాలు పనులు చేస్తున్నారు. సంతకవిటి, శ్రీహరినాయుడుపేట, కృష్ణంవలస, కొండగూడెం, సోమన్నపేట తదితర గ్రామాలకు ఇప్పటకీ సాగునీరు అందుబాటులో లేదు. దీంతో నారు ఎండిపోతోంది. ఇదే మండలంలో నారాయణపురం ఆనకట్ట ఆయకట్టు పరిధిలో సాగునీరు చేరడంతో ఆయా గ్రామాల రైతులు వరినాట్లు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. పంట కాల్వకు దూరంగా ఉన్నవారు అయోమయంలోనే ఉన్నారు.
సస్యరక్షణ చర్యలు అవసరం
ఎండల తీవ్రత కారణంగా నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉన్నందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడికి మల్టీకె 2-3గ్రామాలు, 3ట్యాంక్‌ల వాటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా 10 నుంచి 15 రోజుల వరకు నారుమడులకు ఊత లభిస్తుంది. అలాగే 17-17-17, 19-19-19 రకాల ఎరువును నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. ఉద్యాన పంటల సాగుకు సమాయత్తం కావాలి.
- కిరణ్‌కుమార్, ఏవో, గజపతినగరం
-------------------
సాగుపై మమకారంతో..
ఎలాగైనా నాట్లు వేయాలని.. ఉబాలు పనులు చేపట్టి తీరాలని నిర్ణయించుకున్న అక్కడి రైతులు మురుగు నీటిని మళ్లించి సాగు పనులు చేపట్టారు. విజయనగరం ధర్మపురి సమీపంలో మురుగు కాలువ నీటిని ఇటీవల వ్యవసాయ పొలాల వైపు మళ్లించి ఉబాలు పూర్తిచేశారు. - విజయనగరం కంటోన్మెంట్, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి):
-------------------------
నారు బతికించుకోవాలని..
ఎస్.కోట మండలంలోని శివరామరాజుపేట రైతులు నారును కాపాడుకునేందుకు కష్టపడుతున్న పరిస్థితి సోమవారం కనిపించింది. వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు తెచ్చి తడి అందిస్తున్నారు. ఈ పరిస్థితిపై రైతు జగదీష్ మాట్లాడుతూ తమకు డబ్బు ముఖ్యం కాదని, పంట ముఖ్యమని, ట్యాంకర్ నీరు రూ.వెయ్యికి కొనుగోలు చేసి నారును తడుపుతున్నామన్నారు.
- ఎస్.కోట రూరల్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):