Just Nine Days Left మరో తొమ్మిది రోజులే..
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:16 AM
Just Nine Days Left జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం కేవలం 44.36 శాతమే.
వంద శాతం పూర్తయిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
డిజిటలైజేషన్ మాత్రం 44.36 శాతమే..
పార్వతీపురం, జూలై4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం కేవలం 44.36 శాతమే. ఈనెల 14లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 7,90,562 మంది ఓటర్లు ఉన్నారు. 1032 మంది బీఎల్‌వోలు ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేశారు. 3,50,680 ఫారాల వరకు డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఓటర్ల జాబితాలో ప్రతీ పౌరుడి పేరు ఉండాలనే ఉద్దేశంతో పాటు అనర్హులను, డూప్లికేట్ నమోదులను తొలగించి ఓటర్ల జాబితాను కచ్చితంగా పారద ర్శకంగా రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా సర్ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే సర్వే సమయాన్ని మార్చాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత పల్లెల్లో చాలామంది పనులకు వెళ్లిపోవడంతో ఇళ్లలో ఎవరూ ఉండడం లేదు. దీంతో ఇంటింటా సర్వే జాప్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి , సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
గడువులోగా పూర్తి చేయాలి
సీతానగరం జూలై 4 (ఆంఽధ్రజ్యోతి): గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. శనివారం పెదభోగిల సచివాలయం-1లో ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి పనులను ఆలస్యం చేయొద్దన్నారు. అవసర మైతే ప్రాంతాలకు చేరుకుని సకాలంలో పనునలు జరిగేలా చూడాలని ఆదేశించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిజిటలైజేషన్ వేగవంతం : సబ్ కలెక్టర్
భామిని, జూలై4(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియలో భాగంగా ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. శనివారం భామిని మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత బాలేరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న సర్ డిజిటలైజేషన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఎన్యూమరేషన్ ఫారాల ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకూడదన్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేయాలని, ఇందుకోసం బీఎల్‌వోలు మరింత సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్ నిర్వహణలో అలసత్వం పనికిరాదన్నారు. నిబంధ నల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో భామిని తహశీల్దార్ ఎం.నాగేంద్ర ప్రసాద్, ఎంపీడీవో, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.