ఆర్టీఐ సమాచారం ఇవ్వట్లే!
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:34 PM
: ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ముఖ్య ఉద్దేశం.
- అనేక శాఖల వద్ద దరఖాస్తులు పెండింగ్
- జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
- పలువురి అధికారులకు మెమోలు జారీ
గరుగుబిల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం ఏ పౌరుడైనా ప్రభుత్వ అధికారుల నుంచి ఏ సమాచారమైనా దరఖాస్తు ద్వారా అభ్యర్థించవచ్చు. సంబంధిత అధికారి వెంటనే లేదా 30 రోజుల్లో ఆ సమాచారం అందించాలి. అయితే, జిల్లాకు సంబంధించి ఆర్‌టీఐ సమాచారం అందించడంలో కొందరు అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సమాచారం మేరకు.. జిల్లా విద్యాశాఖాధికారికి సంబంధించి 347 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారికి సంబంధించి 29 దరఖాస్తులు, డీడీ గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి సీతంపేట ఐటీడీఏకు 3, పార్వతీపురానికి 15, జిల్లా పశు వైద్యాధికారి 11, జిల్లా సహకార శాఖ అధికారి 4, మహిళా సంక్షేమాధికారి 4, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ 2 దరఖాస్తులు, సీతంపేట డిగ్రీ కళాశాల, జిల్లా మార్కెటింగ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు శుక్రవారం మెమోలు జారీ చేశారు. ఆర్‌టీఐ సమాచారం అందించడంలో ఎందుకు విఫలమయ్యారన్న దానిపై మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి సమాచారం అందించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని మెమోలో పేర్కొన్నారు.