Share News

ఈకేవైసీపై చేయించుకోవట్లే!

ABN , Publish Date - May 30 , 2026 | 12:44 AM

రేషన్‌ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని, చేయించుకోకపోతే రేషన్‌ కట్‌ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

 ఈకేవైసీపై చేయించుకోవట్లే!

- జిల్లాలో 43వేల మంది దూరం

- నేడు, రేపే గడువు

- నిర్లక్ష్యం చేస్తే నష్టం

- రేషన్‌, గ్యాస్‌ సబ్సిడీ కట్‌

రాజాంరూరల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని, చేయించుకోకపోతే రేషన్‌ కట్‌ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. అయినా చాలామంది కార్డుదారులు ఈకేవైసీని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవగాహనలేక కొందరు, అలసత్వం వల్ల మరికొందరు, తొందరేముందిలే అనే నిర్లక్ష్యధోరణితో ఇంకొందరు ఈకేవైసీ చేయించుకోవడం లేదు. కేవలం రెండురోజులు(శని, ఆదివారం) మాత్రమే గడువు ఉండడంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 7.30 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 16,51,843 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 15,60,348 మంది ఈకేవైసీ చేయించుకోగా, 36,322 మంది ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. మిగతా వారు ఐదేళ్లలోపు పిల్లలు కావడంతో వారికి ఈ ప్రక్రియ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. విజయనగరం రూరల్‌లో ఎక్కువగా ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. రాజాం, బొబ్బిలి మండలాల్లో రెండువేలకు పైగా కార్డుదారులు పెండింగ్‌లో ఉన్నారు. గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, ఎల్‌.కోట, బాడంగి, బొండపల్లి, రామభద్రపురం మండలాలలో వెయ్యిలోపు ఈకేవైసీ చేయించుకోలేదు.

పథకాలన్నింటికీ లింక్‌..

దాదాపుగా సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్‌కార్డుతో ప్రభుత్వం లింక్‌ పెట్టింది. కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య, చేనేత, గీతకార్మిక, డప్పు కళాకారులు పింఛన్‌ పొందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరి. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్‌ వైద్యసేవ, తల్లికి వందనం, గ్యాస్‌ సబ్సిడీ పొందేందుకు సైతం బియ్యం కార్డు ప్రామాణికంగా మారింది. ఇవన్నీ పొందాలంటే రేషన్‌కార్డుదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాధ్‌ సూచించారు.

ఫ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. గ్యాస్‌ వినియోగదారులు సబ్సిడీని నిరంతరాయంగా పొందాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరిగా చేయించాలని స్పష్టం చేసింది. వినియోగదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు మూడు పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ యాప్‌ ద్వారా, గ్యాస్‌ ఏజెన్సీల వద్ద నేరుగా, డెలివరీ బాయ్‌ సిలిండర్‌ తెచ్చినపుడు ఇంటివద్దనే బయోమెట్రిక్‌ పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది.

Updated Date - May 30 , 2026 | 12:44 AM