Just Four More Days.. మరో నాలుగు రోజులే..
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:22 AM
Just Four More Days.. ఎల్‌నినో ప్రభావంతో వరితో పాటు మొక్కజొన్న సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 15తో గడువు ముగుస్తుండగా.. బీమా నమోదు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది.
15తో ముగియనున్న గడువు
అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం
పథకానికి దూరమవుతున్న రైతులు
సద్వినియోగం చేసుకుంటే మేలే..
పార్వతీపురం, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వరితో పాటు మొక్కజొన్న సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 15తో గడువు ముగుస్తుండగా.. బీమా నమోదు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున పంటలు సాగు చేసే రైతులతో తప్పనిసరిగా బీమా చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పూర్తిస్థాయిలో రైతులు తమ పంటలకు బీమా చేయించుకోలేకపోతున్నారు. మొత్తంగా చాలామంది పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి దూరంగానే ఉన్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 72,829 హెక్టార్లలో వరి సాగు చేపడుతుండగా.. ఇప్పటివరకు 23,552 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇక 4,853 హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతోంది. వరి పంటకు ఎకరాకు రూ.800 ప్రీమియం చెల్లిస్తే.. పరిహారంగా సుమారు రూ.40 వేల వరకు చెల్లిస్తారు. మొక్క జొన్నకు సంబంధించి ఎకరాకు రూ.330 ప్రీమియం చెల్లిస్తే.. రూ.33 వేలు వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. టాటా ఏఐజీ మోడల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా ఇప్పటివరకు జిల్లాలో 5,644 మంది రైతులు 3031 హెక్టార్లలో పంటకు బీమా చేయించుకున్నారు. ఈనెల 15లోపు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది 10,556 మంది రైతులు 5,563 హెక్టార్లలో పంటకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుండడంతో ఎంతమంది బీమా చేయించుకుం టారని ప్రశ్నార్థకంగా మారింది.
ప్రీమియంలో వ్యత్యాసమే కారణమా?
శ్రీకాకుళం జిల్లాలో వరికి ఎకరాకు రూ.160 ప్రీమియం చెల్లిస్తుండగా.. మన్యంలో మాత్రం ఎకరాకు రూ.800 చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా కొంతమంది రైతులు బీమాపై ఆసక్తి చూపడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
‘జిల్లా రైతులు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పంట నష్టపోయినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున వరితో పాటు మొక్కజొన్న సాగు చేసే రైతులు తప్పకుండా బీమా చేసుకోవాలి. దీనిపై మా శాఖ ద్వారా అన్నదాతలను చైతన్యపరుస్తున్నాం.’ అని డీఏవో భవానీ శంకర్ తెలిపారు. ‘మన్యం జిల్లాలో ఇప్పటివరకు 3301 హెక్టార్లలో పంటకు సంబంధించి రైతులు బీమా చేయించుకున్నారు. ఈనెల 15 వరకు గడువు ఉంది.’ అని జిల్లా టాటా ఐజీఐసీ లిమిటెడ్ నోడల్ అధికారి అచ్చెన్నాయుడు కోరారు.