Share News

పెళ్లైన నెల రోజులకే..

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:17 AM

పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

పెళ్లైన నెల రోజులకే..

  • నవ వధువు ఆత్మహత్య!

కొమ్మాది, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. విశాఖ పరిధి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మెత్తివ లసకు చెందిన ఎం.కృష్ణవేణి(25)కి అదే జిల్లా మెంటాడ మండ లం గుర్రమ్మవలస గ్రామానికి చెందిన దగ్గర బంధువు యాండ్రా పు మురళితో మే 13న వివాహం జరిగింది. కృష్ణవేణి గోపాల పట్నం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని షాపింగ్‌మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా, మురళి తగరపువలస దివీస్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు మధురవాడ సమీపంలోని పీఎంపాలెం ఆర్‌హెచ్‌ కాలనీలో కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి మురళి విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఆందోళన చెంది గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని, పోలీసులకు సమాచారమిచ్చారు. నార్త్‌జోన్‌ ఏసీపీ అప్పలరాజు, పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పెళ్లైన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఇష్టంలేని పెళ్లి చేశారా? మరేవైనా కారణాలున్నాయా? అని ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా దంపతుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటాను విశ్లేషిస్తామన్నారు. కాగా ప్రస్తుతం కృష్ణవేణిది ఆత్మహత్యగానే పరిగణిస్తున్నామని, ఆత్మహత్యకు కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 12:17 AM