Share News

Just ₹5 per Kilogram..! కిలో ఐదు రూపాయ‌లే..

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:36 AM

Just ₹5 per Kilogram..! టామాటాతో పాటు క్యాబేజీ బుట్ట ధర కూడా పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Just ₹5 per Kilogram..!   కిలో ఐదు రూపాయ‌లే..
క్యాబేజీ పంటను కోస్తున్న రైతులు

  • తీవ్ర ఆవేదనలో రైతులు

  • ఆదుకోవాలని విన్నపం

వీరఘట్టం, మార్చి27(ఆంధ్రజ్యోతి): టామాటాతో పాటు క్యాబేజీ బుట్ట ధర కూడా పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కూరగాయల సాగుపై ఆధారపడి వీరఘట్టం మేజర్‌ పంచాయ తీలో సుమారు 400 కుటుంబాలు జీవిస్తున్నాయి. కాగా వారు టమాటాతో పాటు క్యాజేజీ బుట్ట సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించడంతో వాటి దిగుబడి బాగానే వచ్చింది. దీంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. కాగా ప్రస్తుతం పది కేజీల క్యాబేజీ బుట్ట ధర రూ. 50 నుంచి రూ.70 మాత్రమే పలుకుతోంది. కేజీ లెక్కన ఒక క్యాబేజీ బుట్ట ధర మాత్రం రూ.ఐదుకు మించడం లేదు. దీంతో రైతులు ప్రత్యేక వాహనాల్లో శ్రీకాకుళం, విశాఖ వరకు పంటను తీసుకెళ్లి విక్రయిస్తున్నా ప్రతిఫలం దక్కడం లేదు. అక్కడ కూడా ధర లేక నష్టానికే పంటను విక్రయిస్తున్నారు. వాహనాల అద్దె రూ.5 వేలు పోనూ ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక 23 కిలోల టమాటా ధర ప్రస్తుతం రూ.70 నుంచి రూ. 80 మాత్రమే ఉండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అయితే కేజీ టమాటాను వ్యాపారులు రూ.5 నుంచి రూ.10కు విక్రయిస్తూ లాభపడుతున్నారు. రైతులకు మాత్రం నష్టం తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంఽధిత అధికారులు చొరవ చూపి.. రైతు బజార్ల ద్వారా గిట్టుబాటు ధరకు క్యాబేజీ, బుట్ట, టామాటా విక్రయించి తమను ఆదుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

పొలంలోనే వదిలేశా..

నేను 25 ఏళ్లుగా కూరగాయలు పంట పండిస్తున్నా. 80 సెంట్లలో టమాటా వేశా. ధర లేకపోవడంతో సుమారు 300 ట్రేలు పట్టే టమాటాను పంట కోయకుండా పొలంలోనే విడిచి పెట్టాను. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు.

- బి.అప్పలస్వామి, రైతు, వీరఘట్టం

====================================

అధికారులు స్పందించాలి..

వేలాది రూపాయలు వెచ్చించి రెండు ఎకరాల్లో క్యాబేజీ బుట్ట, టామాటా సాగు చేపట్టా. ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా.. ధర లేక నష్టపోతున్నాం. దీనిపై సంబంధిత అధికా రులు స్పందించాలి. విస్తృతంగా రైతు బజార్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడితే రైతులకు కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది.

- కె.గురు ప్రసాద్‌, రైతు, వీరఘట్టం

Updated Date - Mar 28 , 2026 | 12:36 AM