న్యాయాధికారులు, న్యాయవాదులు చిత్తశుద్ధితో పని చేయాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 10:59 PM
న్యాయాధికారులు, న్యాయవాదులు చిత్తశుద్ధితో పనిచేసి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ అన్నారు.
- హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రాజశేఖర్
- ఎస్.కోటలో కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ
ఎస్.కోట రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): న్యాయాధికారులు, న్యాయవాదులు చిత్తశుద్ధితో పనిచేసి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ అన్నారు. ఎస్.కోటలో రూ.8కోట్లతో నిర్మించనున్న కోర్టు భవనానికి వారు ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఒక ప్రైవేటు హాల్‌లో జరిగిన సమావేశంలో జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అంటే తరాలు తిరిగినా న్యాయం జరగదన్న అభిప్రాయం నేటి సమాజంలో ఉందని, ఈ అపవాదును తొలగించాలని అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగించాలన్నారు. హడావుడిగా తీర్పులు ఇస్తే మళ్లీ కోర్టుల్లో కేసులు పడతాయన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల సూచనలు, అభ్యర్థనల మేరకు తాము నూతన భవనాలు కేటాయిస్తున్నామని తెలిపారు. కోర్టుబెంచ్, బార్ సమన్వయంతో పనిచేస్తే మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ కేసులు 40ఏళ్ల పైబడి పెండింగ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటివల్ల కోర్టుల ఎన్నేళ్లు చుట్టూ తిరిగినా న్యాయం జరగదన్న అపవాదు మిగిలిందన్నారు. కోర్టులు, సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా ఎందుకు సకాలంలో తీర్పులు ఇవ్వలేకపోతున్నామన్న ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మెగా లోక్‌అదాలత్‌లతో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. లోక్‌అదాలత్ ద్వారా తొలివిడత మూడు లక్షల కేసులు, రెండో విడత మూడు లక్షల కేసులు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మీడియేషన్‌పై ఫోకస్ పెడుతూ శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా కేసులను రాజీ చేసేందుకు వేగవంతమైన ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తనకు ఉత్తరాంధ్ర అంటే మమకారం ఎక్కువ అని అన్నారు. జస్టిస్ రాజశేఖర్ మాట్లాడుతూ.. న్యాయమూర్తులు కేసులను క్లియర్ చేసే హడావుడిలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తీర్పులు ఇస్తున్నారని, దీనివల్ల ఆ కేసులు మళ్లీ కోర్టుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసుల క్లియరెన్స్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్.కోట భవనం 15నెలల్లో పూర్తవుతుందని, న్యాయవాదులు ఆశించిన ఫలితాలు సాధించాలని కోరారు. జిల్లా న్యాయాధికారి ఎం.బబిత మట్లాడుతూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందిస్తున్న సహకారం ఎప్పుడు మరువమన్నారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఉన్నత స్థాయికి ఎదిగిన కొందరు వ్యక్తులు తాము పుట్టిన ప్రాంతానికి, ఊరు కోసం పనిచేస్తారని అటువంటి వారిలో మానవేంద్రనాధ్‌రాయ్ ఒకరని కొనియాడారు. అన్ని జిల్లాల న్యాయాధికారులకు చక్కటి సలహాలు, సూచనలు అందించి నడిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట న్యాయాధికారి కనకలక్ష్మి, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరిదేముడు, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు.