Joining hands... securing irrigation water చేయి చేయి కలిపి.. సాగునీరు సాధించి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:48 PM
Joining hands... securing irrigation water : సాగునీటి కాల్వపై చెక్‌డ్యాం నిర్మించి తమ చెరువుకు నీళ్లు ఇవ్వాలని ఇద్దనవలస రైతులు ఏళ్ల తరబడి కోరుతూ వచ్చారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. వెళ్లిన ప్రతిసారీ అర్జీలు అందజేశారు. ఏటా పంటలు నష్టపోవడంతోపాటు తాగునీటి సమస్య వెంటాడడంతో విసిగిపోయారు.
చేయి చేయి కలిపి.. సాగునీరు సాధించి
చెక్‌డ్యాంను ఏర్పాటుచేసుకున్న రైతులు
ఇసుక బస్తాలతో నీటి మళ్లింపు
మెంటాడ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సాగునీటి కాల్వపై చెక్‌డ్యాం నిర్మించి తమ చెరువుకు నీళ్లు ఇవ్వాలని ఇద్దనవలస రైతులు ఏళ్ల తరబడి కోరుతూ వచ్చారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. వెళ్లిన ప్రతిసారీ అర్జీలు అందజేశారు. ఏటా పంటలు నష్టపోవడంతోపాటు తాగునీటి సమస్య వెంటాడడంతో విసిగిపోయారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇక చూడవద్దని రైతులంతా బలంగా నిర్ణయించుకుని ఐక్యంగా ముందుకు కదిలారు. చేయి చేయి కలిపి చెక్‌డ్యాం నిర్మించుకున్నారు. ఇద్దనవలస రైతుల చొరవను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇద్దనవలస గ్రామ సమీపంలో చింతాడ తొండి కాలువ ఉంది. పేరుకు సాగు నీటి కాలువే కానీ పూడిక, ముళ్ల పొదలతో నిండిపోయింది. కొద్దిగా ప్రవహించే నీరు కూడా కింది ప్రాంతాలకు తరలిపోతోంది. ఈ కాలువ నీరు ఇద్దనవలస చెరువుకు మళ్లించి ఉంటే సుమారు 400 ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. ఇందుకోసం కాలువపై చెక్‌డ్యాం నిర్మించాలని రైతులు, గ్రామస్థులు సంవత్సరాలుగా అధికారులను కోరుతున్నారు. వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వచ్చి ఎస్టిమేట్లు, హడావుడి, తర్వాత కథ మొదటికే వస్తుండడంతో విసిగిపోయిన ఆ రైతుల్లో ‘మన చేతులు ఏమయ్యాయి? ప్రభుత్వం ఇవ్వని నీటిని మన చెమటతో తెచ్చుకుందాం!’’ అని సంకల్పంబూనారు. రెండు రోజుల పాటు శ్రమించి కాలువలోని పూడికను తొలగించారు. వచ్చే నీరు నిల్వ ఉండేందుకు ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యాం ఏర్పాటు చేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే దాదాపు 100 మంది రైతులు కాలువలోకి దిగి ఐకమత్యంతో శ్రమించి బాగుచేసుకున్నారు.
- మొదటి రోజు కాలువలోని పొదలు, పూడిక తొలగించారు. రెండోరోజు కాలువను నాలుగు అడుగుల లోతు తవ్వి నీరు వచ్చాక నిల్వ ఉండేలా 200 సిమెంట్ గోనెలు తెచ్చి వాటిలో ఇసుక నింపి నీటికి అడ్డంగా పేర్చారు. దీంతో నీరు అధికంగా చేరడం.. నిల్వ నీటి నుంచి చెరువుకు నీరు మళ్లడం చూసి ఆనందపడ్డారు.