Share News

JJM Works జేజేఎం పనులు వేగవంతం

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:26 AM

JJM Works Gain Pace జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద జిల్లాలో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

JJM Works  జేజేఎం పనులు వేగవంతం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద జిల్లాలో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌ జేజేఎం పనులను త్వరగా పూర్తి చేసి పల్లెవాసులు తాగునీరు అందించాలన్నారు. అంగన్‌వాడీలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో తాగునీరు, పారిశుధ్య వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో వాటర్‌, శానిటేషన్‌ కమిటీల సమావేశాల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. 95523 00009 నెంబర్‌కు మెసేజ్‌ పంపి.. రెవెన్యూ, విద్య, వ్యవసాయం, విద్యుత్‌, రవాణా తదితర శాఖలకు చెందిన 1000కు పైగా సేవలు పొందొచ్చన్నారు. ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు క్రీడల్లో పాల్గొనాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఆగస్టు 15లోగా క్రీడా పోటీలను విజయ వంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇకపై వందశాతం ఈ ఆఫీస్‌ విధానమే అమలు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాన్యువల్‌ ఫైళ్లు ఉపయోగించినా.. వెంటనే స్కాన్‌ చేసి ఈ-ఆఫీస్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగుల కోసం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమో దు చేసుకోవాలని సూచించారు. ఈ-శ్రమ్‌ కార్డుతో ప్రమాద బీమా, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందొచ్చని వెల్లడించారు. ఆధార్‌, మొబైల్‌, బ్యాంకు వివరాలతో ఉచితంగా సమీప సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ ఆర్‌.వైశాలి, డీఆర్వో హేమలత, నీటి సరఫరా, పారిశుధ్య మిషన్‌ అధికారి పి.మధుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:26 AM