Share News

jatara movements till now ఇక జాతర్ల జోష్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:31 PM

jatara movements till now వేపాడ మండలం కృష్ణరాయడుపేట తీర్థమహోత్సవంలో ఏర్పాటు చేసిన పరుగు పందెంలో దౌడు తీస్తున్న ఎడ్లు ఇవి. వీటిని చూసేందుకు ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామల ప్రజలు భారీగా చేరారు. అవి పరుగులు తీస్తుంటే కేరంతలు కొట్టారు. జిల్లా అంతటా ఇప్పుడు ఇదే సందడి నెలకొంది. ప్రతిరోజూ ఏదో చోట జాతర జరుగనుంది.

jatara movements till now ఇక జాతర్ల జోష్‌
వేపాడ మండలం కృష్ణరాయుడుపేట తీర్థంలో నాటుబండితో దౌడు తీస్తున్న ఎడ్లు

ఇక జాతర్ల జోష్‌

సంక్రాంతి అనంతరం మొదలైన తీర్థాలు

ఎడ్లు, గుర్రపు పందేలతో సందడే సందడి

శ్రీరామ నవమి వరకు సాగనున్న గ్రామపండగలు

వేపాడ మండలం కృష్ణరాయడుపేట తీర్థమహోత్సవంలో ఏర్పాటు చేసిన పరుగు పందెంలో దౌడు తీస్తున్న ఎడ్లు ఇవి. వీటిని చూసేందుకు ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామల ప్రజలు భారీగా చేరారు. అవి పరుగులు తీస్తుంటే కేరంతలు కొట్టారు. జిల్లా అంతటా ఇప్పుడు ఇదే సందడి నెలకొంది. ప్రతిరోజూ ఏదో చోట జాతర జరుగనుంది.

శృంగవరపుకోట, జనవరి 19(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గ్రామ దేవతల తీర్థాలు మొదలయ్యాయి. ఈ జోష్‌ శ్రీరామ నవమి వరకు కొనసాగుతుంది. ప్రతి మండలంలోనూ జాతర్ల కోలాహలం కనిపించనుంది. ఒకప్పుడు తీర్థమంటే బల్లాట, గుండాట, పేకాట వంటివి కనిపించేవి. వీటితో పాటు పొట్టేలు, కోడిపందేల బరుల్లో డబ్బు చేతులు మారేది. వీటిని పోలీస్‌లు అడ్డుకుంటుండడంతో ఎడ్లు, గుర్రపు పరుగు పందేలు నేడు ట్రెండ్‌ అయ్యాయి. సంక్రాంతి పండగ ముగిసిందనేలోగా గ్రామ దేవతల తీర్థాలు సందడి చేస్తున్నాయి. కోలాటాలు, తప్పెటగుళ్లు, ఎడ్లు, గుర్రపు పందేలు, సంగిడి రాళ్ల పోటీలు, జానపద కళాకారుల ఆటపాటలు, సినీ గేయాలతో డాన్స్‌లను రక్తి కట్టించే డాన్స్‌ బేబీ డాన్స్‌ వంటి స్టేజ్‌ డ్రామాలతో తీర్థాలు కళకళలాడుతున్నాయి.

జిల్లాలో భోగి, సంక్రాంతి పండగల నుంచి గ్రామ దేవతల పేరుతో తీర్థాలను నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామనవమి వరకు ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో తీర్థాలు జరుగుతాయి. వీటికి కూడా ఎక్కడెక్కడో వున్న కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామాలకు చేరుతారు. వీరంతా సరదాగా గడిపేందుకు పలు రకాల పోటీలను, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి.

కాగా ఎడ్లు, గుర్రపు పరుగు పందేలకు పోలీస్‌ల నుంచి అభ్యంతరాలు లేకపోవడంతో వీటిని బహిరంగంగానే నిర్వహిస్తున్నారు. ఏ గ్రామంలో అమ్మవారి తీర్థం జరిగినా ఈ రెండింటిలో ఏదో ఒక పరుగు పందెం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో రెండు, మూడు రోజుల పాటు తీర్థం జరుగుతుంది. ఇలాంటి గ్రామాల్లో ఒక రోజు ఎడ్ల పరుగు, మరో రోజు గుర్రపు పరుగు పందెం నిర్వహిస్తున్నారు. అయితే ఎడ్లు పరుగు పందెం సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరుగెడుతున్న ఎడ్ల బండి వెనక కొంత మంది యువకులు పరుగులు పెడుతుండడంతో బెదురుతున్నాయి. గట్టిగా అరుపులు, కేకలు వేస్తుండడం పక్కనున్న జనాలవైపు దూసుకుపోతున్నాయి. ఆ పరిస్థితిలో ఒక్కోసారి ప్రాణాలను కోల్పోతున్నారు. గత ఏడాది ఓ మండల పరిధిలో పరుగెడుతున్న ఎడ్లు పక్కకు దూసుకురావడంతో అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇదే గ్రామంలో ఈ ఏడాది జరిగిన తీర్థంలోనూ ఎడ్ల పరుగు పందెంలో ఓ బండి పక్కకు వెళ్లడంతో ఓ మహిళ స్వల్పంగా గాయపడింది. ఈ పందేలను చూసేందుకు వచ్చిన వారిని పోలీస్‌లు అదుపు చేయలేకపోతున్నారు.

ఫ గతంలో గయోపాఖ్యానం, సత్యహరిశ్చద్ర, శ్రీరామాంజనేయ యుద్ధం వంటి పౌరాణిక నాటకాలు అడించేవారు. కాలక్రమంలో యువత వాటిపై ఆసక్తి చూపడం లేదు. సాంఘిక నాటకాలు, బుర్రకథలు కొన్నాళ్లు ఆదరించారు. ప్రస్తుతం డాన్స్‌బేబి డాన్స్‌లు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇలా నచ్చిన స్టేజీ డాన్స్‌లు, పందేలు, కొన్ని గ్రామాల్లో వాలీబాల్‌, కబడ్డీ, క్రికెట్‌ వంటి క్రీడలతో పాటు సంప్రదాయ సంగిడీ రాళ్ల పోటీలను ఏర్పాటు చేయడం ద్వారా తీర్థాలను విజయవంతం చేసేందుకు తాపత్రయపడుతున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:31 PM