Share News

Jashwanth Naidu secures first rank. జశ్వంత్‌నాయుడుకు ఫస్ట్‌ ర్యాంకు

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:29 AM

Jashwanth Naidu secures first rank. ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన జశ్వంత్‌నాయుడుకు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది.

Jashwanth Naidu secures first rank. జశ్వంత్‌నాయుడుకు ఫస్ట్‌ ర్యాంకు
అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌కు స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు

జశ్వంత్‌నాయుడుకు ఫస్ట్‌ ర్యాంకు

ఈఏపీ సెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో ప్రతిభ

ఇంజినీరింగ్‌లో ఎక్కువ మందికి ఉత్తమ ర్యాంకులు

ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌

బొబ్బిలి, జూలై 1 (ఆంధ్రజ్యోతి):

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన జశ్వంత్‌నాయుడుకు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఫలితాలు విడుదల చేశారు. ఎక్కువ మంది జిల్లా విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తమ ర్యాంకులు దక్కాయి. బొబ్బిలి పట్టణంలోని బోస్‌నగర్‌ (మిలటరీ కాలనీ) ప్లై ఓవర్‌ బ్రిడ్జి తూర్పు భాగంలో నివాసం ఉంటున్న శంబంగి జశ్వంత్‌నాయుడు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం బొబ్బిలి మండలం పక్కి కాగా తండ్రి సింహాచలం పార్వతీపురం విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి తెంటు శ్రీదేవి పార్వతీపురం మన్యం జిల్లా లచ్చయ్యపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. అన్నయ్య శ్రీధర్‌ నాయుడు రాంచి ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎప్‌సెట్‌లో జశ్వంత్‌నాయుడుకు 160 మార్కులకు గాను 144.53 మార్కులు వచ్చాయి. దీంతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచాడు. ఈయన ప్రాథమిక విద్య బొబ్బిలిలో సాగింది. ఆ తర్వాత టెన్త్‌ వరకు గుడివాడలోనూ, ఇంటర్‌ విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదివాడు.

మెడిసిన్‌ చదవాలనుకుంటున్నా

జశ్వంత్‌నాయుడు

నీట్‌ను ఇటీవల రాశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడిసిన్‌ సీటు సాధించగలనన్న నమ్మకం ఉంది. న్యూరాలజిస్ట్‌గా సమాజానికి సేవలందించాలన్నది నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతోనే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. రోజుకు 18 నుంచి 20 గంటలపాటు చదువుతాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఎప్‌సెట్‌ కన్నా నీట్‌ ర్యాంకు కోసం ఎదురుచూస్తున్నాను. ఈఏపీసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది.

సుఽధీర్‌ కుమార్‌కు 64వ ర్యాంకు

బొబ్బిలి రూరల్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): నారసింహునిపేట గ్రామానికి చెందిన మర్రాపు సుధీర్‌కుమార్‌ ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 64వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈయన తండ్రి చంద్రశేఖర్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా తల్లి అనురాధ గృహిణి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సుధీర్‌ పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయిలో టాప్‌ ర్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. అతన్ని గ్రామస్థులు అభినందించారు.

యోగేంద్ర కుమార్‌కు 75వ ర్యాంకు

శృంగవరపుకోట, జూలై 1(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట పట్టణానికి చెందిన వర్రి యోగేంద్ర కుమార్‌ ఏపీఈఏపీ సెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 75వ ర్యాంకు సాధించాడు. తండ్రి వర్రి రమణ ఉపాధ్యాయుడు. ఇదే మండలంలోని శివరామరాజుపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి పార్వతి గృహిణి.

వివేక్‌నాయుడుకు 92వ ర్యాంకు

రాజాం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఏపీఎప్‌సెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో బూరాడ గ్రామానికి చెందిన గులివిందల సూర్యవివేక్‌నాయుడు రాష్ట్ర స్థాయిలో 92వ ర్యాంకు సాధించాడు. ఈయన 126 మార్కులు కైవసం చేసుకున్నాడు. మొదటి నుంచి చదువులో బాగా రాణిస్తున్నాడు. 10వ తరగతిలో 583 మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో 980 మార్కులు తెచ్చుకున్నాడు. తండ్రి గులివిందల కేశవరావు పంచాయతీ కార్యదర్శి కాగా తల్లి పుణ్యవతి ఉపాధ్యాయురాలు. అయితే సూర్యవివేక్‌నాయుడు ఇటీవల వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 475 ర్యాంకు సాధించాడు. మద్రాస్‌ ఐఐటీలో సీఎస్‌ఈ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపాడు.

Updated Date - Jul 02 , 2026 | 12:29 AM