Jaladhara in 100 Days వందరోజుల్లో జలధార
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:14 AM
Jaladhara in 100 Days భవిష్యత్‌లో నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జలధార కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జల సంరక్షణ పనులను వందరోజుల్లో పూర్తిచేయాలన్నారు.
పార్వతీపురం, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌లో నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జలధార కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జల సంరక్షణ పనులను వందరోజుల్లో పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగునీటి భద్రతా కార్యక్రమాల్లో భాగంగా.. ప్రతిఒక్కరూ నిర్దిష్ట లక్ష్యాల మేరకు పనిచేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జల సంరక్షణ కార్యక్రమాల్లో సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషించాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వలను పెంచి.. వృథాను అరికట్టేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. పాడైన చెరువులు తూములు, పూడికతో నిండి ఉన్న కాలువలను బాగు చేయాలన్నారు. కిలో వరిని పండించడానికి ఐదు వేల లీటర్ల నీరు ఖర్చు అవుతుందని, ఈ మేరకు అల్టర్నేట్ వెట్ అండ్ డ్రై వంటి ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. భూగర్భ జలాల పెరుగుదలతో పాటు వంద శాతం నీటి నిల్వ ఉన్న జిల్లాగా పార్వతీపురం మన్యం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. జిల్లాలో చెరువుల చుట్టూ ఆక్రమణలను జగరకుండా ఉపాధి హామీ పథకం కింద ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ ..ఉత్తరాంధ్ర సంస్కృతిలో భాగమైన గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రదీప్, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.