Share News

Jai Amaravati జై అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:27 AM

Jai Amaravati పార్లమెంట్‌లో అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు సంబరాలు చేశాయి. నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ర్యాలీలు చేపట్టారు. మందుగుండు కాల్చుతూ మద్దతు తెలిపారు.

Jai Amaravati జై అమరావతి
విజయనగరం: అమరావతికి జై కొడుతున్న ఎమ్మెల్యే అదితి

జై అమరావతి

రాజధానికి పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపై హర్షం

జిల్లా అంతటా సంబరాలు

విజయనగరంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

గ్రామాల్లోనూ బాణసంచా కాల్చి మద్దతు

విజయనగరం/ రూరల్‌/ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు సంబరాలు చేశాయి. నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ర్యాలీలు చేపట్టారు. మందుగుండు కాల్చుతూ మద్దతు తెలిపారు. కేక్‌లు కట్‌ చేశారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆమె కారులో వెళ్తూ జాతీయ జెండాను పట్టుకుని విజయసంకేతం చూపుతూ అందరినీ ఉత్సాహ పరిచారు. ఈ ర్యాలీ ఎత్తుబ్రిడ్జి, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు సాగింది. అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జై అమరావతి అంటూ ర్యాలీ పొడవునా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, గంటా రవి, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ గ్రామాల్లో ప్రజలు ఇళ్ల ముంగిట కొవ్వొత్తులు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దేవిబొమ్మ కూడలిలో కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చారు. చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం నాగంమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు ర్యాలీ నిర్వహించారు. అలాగే జిల్లాలోని సచివాలయాల వద్ద సిబ్బందితో పాటు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి అమరావతికి జై కొట్టారు. కలెక్టరేట్‌ ప్రాంగణంతో పాటు కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

రాష్ట్ర భవితకు మలుపు: కలెక్టర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని శాశ్వతం చేస్తూ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపుగా అభివర్ణించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో అనిశ్చితి తొలగి పోయిందని, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. శాశ్వత రాజధాని ప్రకటనతో కేవలం అమరావతి ప్రాంతమే కాకుండా , రాష్ట్రం మొత్తం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఆత్మగౌరవ విజయం

మంత్రి కొండపల్లి

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా పార్లమెంట్‌ ఏకగ్రీవ తీర్మానం చేయడం ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం ఒక బిల్లు ఆమోదమే కాదని, ఐదేళ్ల సుదీర్ఘ పోరాటానికి వేలాది మంది అమరావతి రైతుల మొక్కవోని దీక్షకు, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

చారిత్రాత్మక విజయం

ఎంపీ కలిశెట్టి

అమరావతి రాజధానిగా ఉండాలని ఆంధ్రుల సంకల్పమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అమరావతి రాజధానిని శాశ్వతంగా ఉంచేందుకు పార్లమెంటులో బిల్లు ఆమోదించడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి టీడీపీ శ్రేణులతో సందడి చేశారు. అమరావతి కేవలం ఒక ప్రాంతం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో అభివృద్ది వికేంద్రీకరణతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:27 AM