అధికారం కోసం జగన్ కలలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:20 AM
మూడేళ్లలో అధికారంలోనికి వస్తామని వైసీపీ అధినేత కలలుకంటున్న తీరును చూస్తే జాలేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
బొబ్బిలి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లలో అధికారంలోనికి వస్తామని వైసీపీ అధినేత కలలుకంటున్న తీరును చూస్తే జాలేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి కోటలో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందన్నారు. జగన్ తల్లి విజయమ్మ చేసిన ప్రకటన సారాంశం తెలుసుకుని రాష్ట్ర ప్రజానీకం జగన్ తీరును మరోసారి అర్ధం చేసుకున్నారన్నారు. షర్మిలకు తాను బినామీ కాదని విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. జగన్ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు భిన్నంగా మహిళాసాధికారతకు పెద్దపీట వేశారన్నారు. తాజాగా దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగ సోదరులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కూటమి సుపరిపాలన సునామీలో వైసీపీ చిరునామా గల్లంతైందన్నారు. బొబ్బిలిలో రూ.కోటితో డిజిటల్ లైబ్రరీ, యోగాకేంద్రం, రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తామని ఎంపీ ప్రకటించారు. అంతకన్నా ముందు స్ధానిక ఇందిరమ్మ కాలనీలో రూ.40 లక్షలతో విద్యుదీకరణ పనులు చేపడతామన్నారు. చిలకపాలెం- వయా రామభద్రపురం, బొబ్బిలి- రాయగడ స్టేట్ హైవే విస్తరణ పనులకు డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో టెండర్లు పిలుస్తారన్నారు. కొంతమంది స్వార్థపరులు గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి లాభం పొందాలనుకుంటున్నారన్నారు. బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్ధలు పడుతున్నారని తెలుగు మహిళా నేత గోనా మానస తదితరులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఈ సమస్యలన్నిటిపైనా పార్లమెంట్ లో ప్రస్తావించానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన, సీనియర్ నేతలు అల్లాడ భాస్కరరావు, చింతల రామకృష్ణ, గెంబలి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సత్యనారాయణ, కాకల వెంకటరావు తదితరులు ఉన్నారు.