Share News

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:29 PM

: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి కె.నాగబాబు అన్నారు.

జగన్‌ రాజకీయాలకు పనికిరారు
జనసేన నాయకులతో ఎమ్మెల్సీ నాగబాబు

- ఆయన స్థిరత్వం లేని వ్యక్తి

-ఎమ్మెల్సీ నాగబాబు

పార్వతీపురం/రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి కె.నాగబాబు అన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జనసేన నిర్మాణ సారథుల సమాచారం సేకరణ కమిటీ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ కమిటీలకు సంబంధించి ఆశావహులతో నాగబాబు వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి జైకొట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అని, ఇప్పుడు కొత్తగా మావిగన్‌ అంటూ జగన్‌ మాట్లాడడం చూస్తుంటే ఆయనకు పూర్తిగా స్థిరత్వం లేదని స్పష్టమవుతుందన్నారు. అమరావతి కోసం రైతులు భూములు త్యాగం చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఆ రైతులను ఎన్నో కష్టాలకు గురిచేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంటి విజన్‌ ఉన్న నాయకుడు అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే, వైసీపీ చూసి ఓర్వలేకపోతుందని అన్నారు. ‘ప్రపంచంలో రాజధాని మార్చాలని ఇద్దరే ఇద్దరు ప్రయత్నించారు. అందులో తుగ్లక్‌ ఢిల్లీని రాజధాని కాదని ఔరంగాబాద్‌ మార్చాడు. దానివల్ల కొన్ని వందల మంది చనిపోయారు. మరలా ఔరంగాబాద్‌ నుంచి ఢిల్లీకి రాజధాని మార్చినప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు. అదేవిధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారు.’ అని అన్నారు. భవిష్యత్తులో ఏ పౌరుడు జగన్‌కు ఓటు వేయరని అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, తోటపల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ ఆగూరు వైకుంఠరావు తదితరులు నాగబాబును కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. కార్య క్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.మోహన్‌రావు, జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు పాలూరు బాబు, ఆగూరు శ్రీను, పార్వతీపురం పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ ఆగూరు మణి, తదితర జనసేన పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:29 PM