IVRS Calls గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:52 PM
IVRS Calls to Parents of Tribal Students సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న 47ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాల పనితీరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగా ప్రతి నెలా మొదటివారంలో ఆయా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేస్తోంది.
తలలు పట్టుకుంటున్న ఐటీడీఏ అధికారులు
ముందస్తుగా ఫోన్ ఇన్ కార్యక్రమం
సీతంపేట రూరల్, ఏప్రిల్7(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న 47ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాల పనితీరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగా ప్రతి నెలా మొదటివారంలో ఆయా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేస్తోంది. పాఠశాలల పనితీరు, విద్యార్థుల యోగక్షేమాలు, విద్యా ప్రమాణాలు, మెనూ అమలు తదితర అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అయితే దీనిపై ఐటీడీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవో, డీడీలు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. పనితీరు అధ్వానంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఐవీఆర్‌ఎస్ కాల్స్ వస్తే.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటూ వారు సూచించారు. కాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న 47ఆశ్రమ పాఠశాలల్లో ఏడు పాఠశాలల పనితీరు చాలా అధ్వానంగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు పనితీరు 32వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరి యస్‌గా ఉన్నట్లు బోగట్టా. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనసంక్షేమశాఖాధి కారులు ఆందోళన చెందుతున్నారు.
పర్యవేక్షణ లోపం
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో గిరిజన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లోని మెనూ అమలులో లోపాలు, సరుకుల్లో వ్యత్యాసాలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. కొద్ది రోజుల కిందట పూతికవలస ఆశ్రమ పాఠశాలలో సిబ్బంది నిత్యవసర సరుకుల్లో చేతివాటం ప్రదర్శించడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీడీఏ అధికారులు విచారణ చేపట్టి సంబంధిత డిప్యూటీ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. మద్యం మత్తులో విధులు నిర్వహించిన మర్రిగూడ ఆశ్రమ పాఠశాల వార్డెన్ కూడా సస్పెండ్ చేశారు. బుడగరాయి ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలులో లోపాల కారణంగా డిప్యూటీ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఏపీవో ఏమన్నారంటే ...
‘సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి నెలా మొదటివారంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్ వస్తున్న విషయం వాస్తవమే. అయితే దీనిపై ముందస్తుగా మేమే ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టి.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఐవీఆర్‌ఎస్ కాల్స్ వచ్చేటప్పుడు వాస్తవాలు చెప్పాలని సూచిస్తున్నాం.’ అని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు చెప్పారు