యుద్ధం కొనసాగితేఇబ్బందే!
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:04 AM
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జిల్లాపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
-నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం
- పెట్రోల్, వంట నూనెలపై కూడా ప్రభావం
- ఎరువుల ధరలు సైతం..
విజయనగరం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జిల్లాపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరల పెరుగుదల ఖాయమని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, బిస్కెట్లు, వంట నూనె, సబ్బులు, షాంపులు, టూత్ పేస్టులు, ఎరువుల వంటి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్..
జిల్లాలో 117 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.109.37, డీజిల్ రూ.97.49గా ఉంది. రోజుకు సగటున లక్ష లీటర్ల పెట్రోల్, అదే స్థాయిలో డీజిల్ వినియోగం ఉంటుందని ప్రాథమిక అంచనా. పెరిగిన వాహన వినియోగంతో వీటి వాడకం భారీగా పెరిగింది. ఇరాన్ సమీపంలోని హర్మూజ్ జలసంధి మీదుగానే చమురు నిల్వలు మన దేశంలోకి రావాలి. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. మరోవారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే చమురు దిగుమతులు నిలిచిపోనున్నాయి. దీనివల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడనుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు డీజిల్, పెట్రోల్‌ను అధిక ధరకు విక్రయించే అవకాశం ఉంది.
వంట నూనెలు..
జిల్లాలో ప్రజలు ఎక్కువగా సన్‌ఫ్లవర్, పామాయిల్, రైస్‌బ్రాన్, వేరుశెనగ నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అన్నిరకాల వంట నూనెలు కలిపి 1,700 టన్నులను వ్యాపారులు విక్రయిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెల రూ.15 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇందులో సన్‌ఫ్లవర్ నూనె రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఎర్ర సముద్రం మీదుగా నౌకల్లో దేశానికి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంతో దిగుమతులు ఆగితే వంట నూనెల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.150 వరకూ ఉంది.
ఎరువులు, నిత్యావసరాలు..
జిల్లాలో ఏటా 50 వేల టన్నుల వరకూ ఎరువులు వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. డీఏపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువుల తయారీ కోసం సంబంధిత కంపెనీలు సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను వినియోగిస్తుంటాయి. ఈ ముడిసరుకు 80 శాతం వరకు ఖతార్, యూఏఈ, ఒమన్ నుంచి మన దేశానికి వస్తుంటుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటి దిగుమతి ఆగిపోయి ఆ ప్రభావం ఎరువుల ధరపై పడే అవకాశం ఉంది. గత ఏడాది డీఏపీతో పాటు ఇతర ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా చాలా నిత్యావసరాల వస్తువులు యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతర్, యెమన్, బెహ్రయిన్, జోర్డాన్, ఈజిఫ్ట్, సుడాన్ తదితర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతుంటాయి. వీటిలో బిస్కెట్లు, తలనూనె, సబ్బులు, షాంపులు, టూత్‌పేస్టులు, కంది పప్పు, పెసర పప్పు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే యుద్ధ ప్రభావంతో వీటి దిగుమతులు తగ్గుతాయి. రవాణా చార్జీలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ ప్రభావం వాటి ధరలపై పడే అవకాశం ఉంది.
ధరలు పెరిగే అవకాశం ఉంది..
ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగితే రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, కొన్ని నిత్యావసరాల వస్తువులను ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ కూడా తగ్గుతోంది. ద్రవోల్బణం పెరగడానికి అవకాశం ఉంటుంది. యుద్ధం నాలుగైదు వారాలు జరిగితే మాత్రం ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
-కాపుగంటి శ్రీనివాస్, అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం