Share News

ప్రవేశాలకు వేళాయే!

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:11 AM

2026-2027 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది.

 ప్రవేశాలకు వేళాయే!
కురుపాంలోని జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం

- వివిధ పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

- ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో కూడా..

- నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

విజయనగరం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): 2026-2027 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఐదో తరగతి మొదలు ఇంటర్‌, ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, లాసెట్‌, బీఈడీ వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రకటనలు విడుదలయ్యాయి. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు నెట్‌ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్లు విడుదల చేసింది.

కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత సీట్లు..

ఆర్‌టీఈ చట్టం సెక్షన్‌ 12(1)-సి ప్రకారం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించనున్నారు. పేద పిల్లల కోసం 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు మార్చి 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమ ఆధార్‌ ద్వారా ప్రాథమిక వివరాలతో సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ప్రవేశం కోసం విద్యార్థులు 2020 ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి. స్టేటు సిలబస్‌ పాఠశాలలో ప్రవేశం కోసం 2020 జూన్‌ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి, ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు, భూమి హక్కు, ఎంజీఎన్‌ఈఆర్‌జీఎస్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యార్థుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. విద్యార్థుల ఎంపికకు సంబంధించి మొదటి విడత లాటరీ మార్చి 25న విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 7 మధ్య ప్రవేశాలు పొందాలి. రెండో విడత లాటరీ ఏప్రిల్‌ 12న నిర్వహిస్తారు.

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో..

గురుకుల విద్యాలయాల్లో 5,6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బొబ్బిలిలో బాలురు, తాటిపూడిలో బాలికల గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. అర్హులైన విద్యార్థులు మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హాల్‌ టిక్కెట్లను ఏప్రిల్‌ 15న జారీ చేస్తారు. అదే నెలలో 24న పరీక్ష నిర్వహిస్తారు. మే 15న పలితాలు విడుదల చేస్తారు. ఐదో తరగతి ప్రవేశానికి సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్థలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. బీసీ విద్యార్థులు 2015 సెప్టెంబరు 1 నుంచి 2017 ఆగస్టు 2017 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2013 సెప్టెంబరు 1 నుంచి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2.50లక్షలకు మించి ఉండరాదు. అర్హులైన విద్యార్థులు ఏపీఆర్‌ఎస్‌.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ 100 ఫీజు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఏపీఆర్‌జేసీ, ఏపీడీఆర్‌సీలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మహ్మాతా జ్యోతిబాపూలే పాఠశాలల్లో..

మహ్మాతా జ్యోతిబాపూలే పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశంతో పాటు 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. గజపతినగరం (బాలురు), నెల్లిమర్ల (బాలికలు), గంట్యాడ (బాలికలు), జమ్మునారాయణపురం(బాలురు), కొత్తవలస(బాలికలు), కొరాడ(బాలురు), సాలూరు(బాలికలు), కురుపాం(బాలికలు), పార్వతీపురం(బాలికలు)లో జ్యోతిబాపూలే పాఠశాలలు ఉన్నాయి. ఐదో తరగతిలో చేరేందుకు బీసీ విద్యార్థులు 2015 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 13 సంవత్సరాలకు మించి ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆదాయం ఏడాదికి రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలు మించరాదు. అర్హులైన విద్యార్థులు మార్చి 4 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 19న నిర్వహిస్తారు.

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో..

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేష్‌ జారీ చేసింది. అర్హులైన విద్యార్థులు మార్చి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.700, ఓసీ విద్యార్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మే 12 నుంచి 18 వరకూ, అగ్రికల్చర్‌, పార్మసీ విద్యార్థులకు మే 19,20 తేదీల్లో పరీక్ష జరగనుంది.

Updated Date - Feb 22 , 2026 | 12:11 AM