It’s the same in August too! ఆగస్టులోనూ అంతే!
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:00 AM
It’s the same in August too! ఖరీఫ్ సీజన్ ఏ మాత్రమూ ఆశాజనకంగా లేదు. ఎల్‌నినో ప్రభావం రైతాంగాన్ని తీవ్ర ఆందోళకు గురి చేస్తోంది. తిండి గింజలను సైతం ఇంటికి తీసుకెళ్లగలమో? లేదో ? అన్న కలవరంతో ఉన్నారు. ఆగస్టు ద్వితీయ పక్షంలోకి అడుగుపెట్టేసరికి మూడు వంతుల నేలలో వరినాట్లు పడేవి. ఇప్పుడలా లేదు. ఏ రైతును కదిలించినా నిట్టూర్పే వినిపిస్తోంది.
ఆగస్టులోనూ అంతే!
ఇప్పటివరకూ 20,760 హెక్టారల్లో వరి నాట్లు
మిగిలిన పంటల పరిస్థితీ అంతే
ఈ నెలలో 21 మండలాల్లో లోటు వర్షపాతం
మూడు మండలాల్లో తీవ్రం
ఖరీఫ్ సీజన్ ఏ మాత్రమూ ఆశాజనకంగా లేదు. ఎల్‌నినో ప్రభావం రైతాంగాన్ని తీవ్ర ఆందోళకు గురి చేస్తోంది. తిండి గింజలను సైతం ఇంటికి తీసుకెళ్లగలమో? లేదో ? అన్న కలవరంతో ఉన్నారు. ఆగస్టు ద్వితీయ పక్షంలోకి అడుగుపెట్టేసరికి మూడు వంతుల నేలలో వరినాట్లు పడేవి. ఇప్పుడలా లేదు. ఏ రైతును కదిలించినా నిట్టూర్పే వినిపిస్తోంది.
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి):
గంట్యాడ మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉండగా దీంట్లో తాటిపూడి రిజర్వాయర్ పరిధిలోనే ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగిలినది వర్షాధారమే. రిజర్వాయర్ పరిధిలో అంతటా నాట్లు పడగా వర్షాధార భూముల్లో దాదాపు మూడు వేల ఎకరాల్లో నాట్లు వేశారు. మిగిలిన నాలుగు వేల ఎకరాల్లో నాట్లు పడాలంటే వరుణుడు కరుణ చూపాలి తప్పా వేరే మార్గం లేదు. ఇప్పటికే వరి నారు వేసుకుని 40 రోజులు దాటింది. సాధారణంగా నారు వేసుకున్న 21 రోజుల నుంచి 30 రోజుల లోపు నాట్లు వేసుకుంటే దిగుబడి వస్తుంది. లేదంటే తరువాత నాట్లు వేసినా పెద్దగా లాభం ఉండదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్ధితి గంట్యాడ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లాలో వర్షధారంపై ఆధారపడి ఎక్కువ మంది వరి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా ఆగస్టు నెలలో తప్పకుండా నాట్లు వేయాలి. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం అన్ని పంటలు కలిపి 1,23,608 హెక్టార్లు కాగా వాటిలో సోమవారం వరకూ 35,041 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో ఇదే సమయానికి 68,647 హెక్టార్లలో సాగు చేపట్టారు. ఈ ఏడాది 35 వేల హెక్టార్లకే పరిమితమైంది. వరి పంట విషయానికి వచ్చేసరికి జిల్లాలో 1,00,251 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా వీటిల్లో ఇంతవరకూ 20,760 హెక్టార్లలో నాట్లు పడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో చూపుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు కావస్తున్నా కనీస స్థాయిలో వర్షం కురవలేదు. అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదు అయ్యింది. చెరువులు, వాగులు, గెడ్డల్లో చుక్క నీరు కూడా లేదు. సాధారణంగా జూన్‌లో 123 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 96.3 మిల్లీమీటర్లు కురిసింది. అంటే - 22 మిల్లీమీటర్లు తక్కువ కురిసింది. జూలైలో 170.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 58 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. -65 మిల్లీమీటర్లు తక్కువ నమోదైంది. ఆగస్టులో ఇప్పటి వరకూ 110 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 87.6 మిల్లీమీటర్లే పడింది. అంటే -20 మిల్లీమీటర్లు తక్కువగా కురిసింది. జిల్లాలో సంతకవిటిలో -83.98 మిల్లీమీటర్లు, రేగిడిలో -68-16, వంగరలో -65-93 మిల్లీమీటర్లు చొప్పున తక్కువ వర్షం కురిసింది. 21 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయ్యింది. గుర్ల, జామి, విజయనగరం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
ఈ నెల 15 లోగా వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవల్సిందేనని వ్యవసాయ అధికారులు సూచించారు. వరికి బదులుగా తేలికిపాటి పంటల వైపు దృష్టి పెట్టాలని కోరారు. ఇతర పంటల విత్తనాలు కూడా సిద్ధం చేశారు. ఇందులో మినుములు 13,570 హెక్టార్లకు గాను 2996 క్వింటాళ్లు, పెసలు 9,576 హెక్టార్లకు 2,023 క్వింటాళ్లు, రాగులు 1,161 హెక్టార్లకు 83 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,805 హెక్టార్లకు 775 క్వింటాళ్లు, వేరుశనగ 205 హెక్టార్లకు 455 క్వింటాళ్లు, ఉలవలు 206 హెక్టార్లకు 83 కింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. మొత్తం 26,523 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,415 క్వింటాళ్లను సిద్ధం చేశారు. అయినా ప్రతిరోజు కురుస్తున్న చిన్నచిన్న జల్లులకు చెరువుల్లో ఉన్న కాస్త నీటితో అతి కష్టం మీద నాట్లు వేసుకుంటున్నారు. వరుణుడు కరుణ చూపిస్తే గాని జిల్లాలో పూర్తిస్థాయిలో వరి నాట్లు పడే అవకాశం లేదు.
తుఫాన్లు వస్తున్నాయ్.. వానల్లేవ్
బొబ్బిలి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్ హెచ్చరికలు వస్తున్నా చిరు చినుకులే తప్ప మోస్తరుగా కూడా వాన పడడం లేదు. గతంలో తుఫాన్ ప్రకటన వెలువడితే ఆందోళనకు గురయ్యే రైతాంగం ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా చూడాల్సి వస్తోంది. బొబ్బిలి వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో వరి సగటు విస్తీర్ణం 7230 హెక్టార్లు కాగా 28 శాతం మాత్రమే వరినాట్లు పడ్డాయి. ఆగస్టులో ముమ్మరంగా ఉబాలు జరగాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితులతో ఆ పరిస్థితి కనుమరుగైంది. బొబ్బిలి మండలంలో 7230హెక్టార్లకు గాను 2012 హెక్టార్లలో (28 శాతం) మాత్రమే ఉబాలు జరిగాయి. తెర్లాం మండలంలో 4883 హెక్టార్లకు గాను 2030 హెక్లార్టలో, రామభద్రపురం మండలంలో 2088 హెక్టార్లకు గాను 200 హెక్టార్లలో, బాడంగి మండలంలో 3266 హెక్టార్లకు గాను 554 హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. ప్రతిరోజూ ఆకాశంవైపు ఆశగా చూస్తున్న రైతన్నకు వరుణుని కరుణ లభించడం లేదు.
సెప్టెంబరు 15 దాకా ఎదురుచూస్తాం
ఎం.మధుసూదన్‌రావు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టరు, బొబ్బిలి
బొబ్బిలి వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో వరినాట్లు మందకొడిగానే సాగుతున్నాయి. బోర్లు, ఇతర నీటి వనరులున్న ప్రాంతాల్లో అరకొరగా ఉబాలు జరిగాయి. సెప్టెంబరు 15 దాకా ఆశగా ఎదురుచూస్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలకోసం ఉపక్రమిస్తాం. తెర్లాం ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఎద సాగు చేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే ఆ పంటను కాపాడుకునేవీలుంటుంది.
ముదిరిపోతున్న నారు
పూసపాటిరేగ, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగుపై పూసపాటిరేగ మండల రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆగస్టు సగం పూర్తయినా 100 ఎకరాల్లో కూడా వరినాట్లు పూర్తికాలేదు. మరోవైపు నారు ముదిరిపోతోంది. వరుణుడి కరుణ కోసం రైతులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. మండలంలో సాధారణంగా 5వేల ఎకరాలలో వరిపంటను సాగుచేస్తారు. ఇందులో రెండువేల ఎకరాలకు మోటార్లు ఉన్నాయి. మిగిలిన పంట అంతా వర్షాధారమే. అయితే చెరువుల్లోనూ నీరు లేక అన్నదాతలు నిరాశలో పడ్డారు.