Share News

It's okay to put up fencing! ఫెన్సింగ్‌ వేస్తే సరి!

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:37 AM

It's okay to put up fencing! వేపాడ మండలంలోనూ రియల్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డిపట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు వాటిని ఆనుకొని ఉన్న గెడ్డవాగులను, బంజరు భూములను ఆక్రమించి ఫెన్సింగ్‌లు వేసేస్తున్నారు.

It's okay to put up fencing! ఫెన్సింగ్‌ వేస్తే సరి!
గెడ్డవాగులో పెన్సింగ్‌ పోల్స్‌ ఏర్పాటు చేసిన దృశ్యం.

ఫెన్సింగ్‌ వేస్తే సరి!

వీలుపర్తిలో గెడ్డవాగు ఆక్రమణ

దర్జాగా ఫెన్సింగ్‌ పోల్స్‌ ఏర్పాటు

అధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు

వేపాడ ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): వేపాడ మండలంలోనూ రియల్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డిపట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు వాటిని ఆనుకొని ఉన్న గెడ్డవాగులను, బంజరు భూములను ఆక్రమించి ఫెన్సింగ్‌లు వేసేస్తున్నారు. వీలుపర్తి రెవెన్యూలోని సర్వే నెంబరు 22లో ఉన్న గెడ్డ వాగు వద్ద పరిస్థితి ఇందుకో ఉదాహరణ. వాగును ఆక్రమించి గ్రామస్థుల రాక పోకలకు ఇబ్బంది కల్పించేలా ఫెన్సింగ్‌ వేయడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది.

గెడ్డవాగును కలుపుకొని పెన్సింగ్‌ వేయడం వల్ల రైతులు సమీపంలో ఉన్న కొండకు వెళ్లేందుకు, పశువులను మేతకు తోలేందుకు ఇబ్బంది పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇదే రెవెన్యూలో 7.98 ఎకరాలు, 7.21 ఎకరాల జిరాయితీ భూములను కొనుగోలు చేశాడు. వీటిని ఆనుకుని ఉన్న 80 ఎకరాల డీ పట్టా భూములను కూడా కారు చౌకగా కొనేశాడు. ఈ భూములను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను, గెడ్డ వాగులను స్వాధీనం చేసుకునే ఎత్తుగడతో ఫెన్సింగ్‌ పనులు చేయిస్తున్నాడు. డీ పట్టా భూమిలోని చెట్లను అనుమతులు లేకుండా నరికించి షామిల్లులకు తరలించాడని సమాచారం.

కాగా గతంలో కూడా సర్వే నెంబరు 10లోని భూముల్లోకి వెళ్లేందుకు దారి కల్పించాలని గ్రామానికి చెందిన రైతు గోకాడ సన్నిబాబు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేయడమే కాకుండా సర్వే నిర్వహించారు. రైతు కోరిక మేరకు దారి ఇవ్వాలని భూ యజమానికి సూచించారు. అప్పట్లో దారి ఇచ్చేందుకు భూ యజమాని కూడా అంగీకరించి ఫెన్సింగ్‌ పోల్స్‌ను తొలగించారు. అయితే ఈ భూములను ఇటీవల కొనుగోలు చేసిన భూ యజమాని ఇప్పుడు ఏకంగా గెడ్డవాగులో నుంచి కంచె ఏర్పాటు చేస్తున్నాడు. దీనివల్ల సర్వే నెంబరు 22లో ఉన్న 149 లింకుల గెడ్డ వాగు కుచించుకు పోయిందని రైతులు వాపోతున్నారు. అలాగే ఎకరా 48 సెంట్లు ఆక్రమణకు గురైంది. సర్వే నెంబరు 10లోని భూముల్లోకి వెళ్లేందుకు పూర్తిగా దారి లేకుండా పోతోందని రైతు గోకాడ సన్నిబాబు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు, మీడియాకు తెలియజేశారు.

చర్యలు తీసుకుంటాం

వాగు ఆక్రమణపై తహసీల్దార్‌ జె.రాములమ్మను వివరణ కోరగా గెడ్డ వాగు ఆక్రమణల విషయం ఇంతవరకు తమ దృష్టికి రాలేదని, గ్రామానికి చెందిన ఓ రైతు ఫిర్యాదు చేయడంతో గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేయర్‌ను పరిశీలనకు పంపించామన్నారు. గెడ్డవాగు సుమారు ఎకరా 68 సెంట్లను ఆక్రమించుకోవడమే కాకుండా ఏవిధమైన అనుమతులు లేకుండా పెన్సింగ్‌ వేస్తున్నట్లు గుర్తించారని, పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:37 AM