కొండచీపుర్లను కొనట్లే!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:11 AM
ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా పండుతున్న కొండచీపుర్లకు ఆశించిన డిమాండ్ ఉండడం లేదు. పంట ఎక్కువ.. ప్రతిఫలం తక్కువ అన్న చందంగా పరిస్థితి తయారైంది.
- ముందుకురాని వ్యాపారులు, జీసీసీ
- గిరిజన రైతుల వద్ద పేరుకుపోతున్న నిల్వలు
- డిమాండ్ లేదంటున్న అధికారులు
సీతంపేట రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా పండుతున్న కొండచీపుర్లకు ఆశించిన డిమాండ్ ఉండడం లేదు. పంట ఎక్కువ.. ప్రతిఫలం తక్కువ అన్న చందంగా పరిస్థితి తయారైంది. గతంలో పంటకు డిమాండ్ ఉంటే ధర ఉండేది కాదు. ఇప్పుడు ధర ఉందంటే డిమాండ్ లేక ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. దీంతో కొండచీపుర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి.
ఇదీ పరిస్థితి..
సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా గిరిజన రైతులకు లాభాన్ని తీసుకువచ్చే పంట ఏదైనా ఉంది అంటే అది కొండచీపుర్లే. మన్యం ప్రాంతంలో సుమారు 6 వేల ఎకరాల్లో ఈ పంటను గిరిజనులు సాగుచేస్తున్నారు. నాణ్యతను బట్టి వీటిని మూడు రకాలుగా విభజించి వారపు సంతల్లో మైదాన ప్రాంత వ్యాపారులకు విక్రయిస్తుంటారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి పట్టణాలకు ఎక్కువగా సరఫరా అవుతాయి. సీతంపేట, దోనుబాయి, మర్రిపాడు, కుసిమి, పూతికవలసలో జరిగే వారపు సంతలకు వ్యాపారులు వచ్చి వేల సంఖ్యలో కొండచీపుర్లను కొనుగోలు చేసేవారు. గ్రేడ్-1 రకం చీపురుకు రూ.35, గ్రేడ్-2కు రూ.30, గ్రేడ్-3 రకానికి రూ.25 ధర చెల్లించి కొనుగోలు చేసేవారు. అయితే, కొండచీపుర్లకు మద్దతు ధర కోసం ఐటీడీఏ, జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ప్రత్యేక చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా గ్రేడ్-1 రూ.45, గ్రేడ్-2 రూ.40, గ్రేడ్-3 రూ.35వరకు మద్దతు ధరను స్వల్పంగా పెంచాయి. కొనుగోలు కోసం అడ్వాన్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఏజెన్సీలో వారపు సంతలపై ఆధారపడిన సుమారు 20మంది వ్యాపారులను ఈ అడ్వాన్స్ టెండరింగ్ విధానంలో భాగస్వాములను చేశాయి. వారికి టార్గెట్‌ల ఇచ్చి కొండచీపుర్లను కొనుగోలు చేయిస్తున్నాయి. ఈ విధానం ద్వారా గిరిజన రైతులకు కొంతమేర లాభం చేకూరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు మాత్రం జరగడం లేదు. జీసీసీ కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజన రైతులు వేల ఎకరాల్లో పండిస్తున్న పంటకు డిమాండ్ లేకపోవడంతో ఇళ్ల వద్ద చీపుర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి.
కొనుగోలు జరగడం లేదు..
కొండచీపుర్లను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో చేసేది లేక పంటను ఇంటి వద్దే భద్రపరచుకుంటున్నాం. రానున్న మార్చి, ఏప్రిల్‌లో కొనుగోలు చేస్తారనే ఆశతో ఉన్నాం.
-రాజారావు, గిరిజన రైతు
జీసీసీ కొనుగోలు చేయాలి
గిరిజన రైతులు సేకరిస్తున్న కొండచీపుర్లకు జీసీసీ గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలి. మైదాన వ్యాపారులతో పాటు జీసీసీ కూడా కొనుగోలు చేస్తేనే గిరిజన రైతుల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
-జీలకర్ర శ్రీరాములు, గిరిజన సంఘం నాయకుడు
డిమాండ్ తగ్గింది..
ప్రస్తుతం కొండచీపుర్ల సీజన్ కాకపోవడంతో వాటికి డిమాండ్ తగ్గింది. అందుకే కొనుగోలు జరగడం లేదు. కొండచీపుర్లతో పాటు మరికొన్ని అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచాం. అడ్వాన్స్ టెండరింగ్ విధానం ద్వారా వ్యాపారులకు కొనుగోలు లక్ష్యాలను కూడానిర్దేశించాం.
డి.కృష్ణారావు, బీఎం, గిరిజన సహకార సంస్థ