Encroach చెరువే కదా.. ఆక్రమించేద్దాం!
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:44 PM
“It’s Just a Pond… Let’s Encroach on It!” ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అది చెరువైనా జంకడం లేదు. మక్కువ మెయిన్‌రోడ్డుకు ఆనుకున్న ఉన్న వెంకట (భైరి)సాగరం చెరువు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది. అధికారులు అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు. కొంతమంది జోరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. సర్వేనెంబరు 223లో 22.10 ఎకరాల్లో విస్తరించిన వెంకట(భైరి)సాగరం చెరువు రోజురోజుకూ కుచించుకుపోతోంది.
అధికారులు అడ్డుకున్నా ఆగని కట్టడాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్వో
మక్కువలో ముదురుతున్న వెంకట(భైరి)సాగరం చెరువు వివాదం
మక్కువ, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అది చెరువైనా జంకడం లేదు. మక్కువ మెయిన్‌రోడ్డుకు ఆనుకున్న ఉన్న వెంకట (భైరి)సాగరం చెరువు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది. అధికారులు అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు. కొంతమంది జోరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. సర్వేనెంబరు 223లో 22.10 ఎకరాల్లో విస్తరించిన వెంకట(భైరి)సాగరం చెరువు రోజురోజుకూ కుచించుకుపోతోంది. దీని కింద సుమారు 40 ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఆక్రమణదారులు తగ్గడం లేదు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువు గట్టును ఆక్రమించుకుని షెడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా చేశారని కొంతమంది ఆయకట్టు దారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకు న్నారు. అయితే తాజాగా ఆదివారం తిరిగి షెడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు, ఆయ కట్టుదారులు పెదవి విరుస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. చెరువులో ఆక్రమణలన్నీ తొలగిస్తేనే తాము షెడ్డు నిర్మాణం నిలుపుదల చేస్తానని సదరు వ్యక్తి చెబుతున్నాడు. కాగా దీనిపై మక్కవ వీఆర్‌వో సురేష్ మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోటీసులు అందించినా అక్రమ కట్టడాలు ఆగడం లేదని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ పరిస్థితి..
- మక్కువలో రోడ్డువిస్తరణ, కాలువల నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి చెరువు గట్టుపై ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారింది. చెరువు గట్టుపై అక్రమంగా నిర్మించిన భవనాలు, వ్యాపారాల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు , ఇతర అక్రమ కట్టడాలను తొలగించి 100 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు వెడల్పు చేయాలని ఒక వర్గానికి చెందిన నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చెరువుగట్టుపై షెడ్లు వేసుకున్న కొంతమంది వ్యాపారులు, గ్రామంలోని రోడ్డుపక్కన బడ్డీలు ఏర్పాటు చేసుకున్న వారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి తమ గోడు వినిపించారు. రోడ్డువిస్తరణ వెడల్పు తగ్గించాలని కోరారు.
- చిరువ్యాపారుల వినతి మేరకు రోడ్డు వెడల్పును రెండువైపులా చెరో 10 అడుగులు తగ్గించారు. 80 అడుగుల విస్తీర్ణంలో పనులు చేపట్టాలని మంత్రి సంధ్యారాణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రామంలోని మెయిన్ రోడ్డులో బస్టాండుకు ఆనుకుని ఉన్న వెంకట(భైరి)సాగరం చెరువులో ఆక్రమణల తొలగింపునకు అధికారులు వెనుకంజ వేస్తుండడం వివాదాస్పదంగా మారింది.
- ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ కుటుంబం .. వెంకట(భైరి)సాగరం చెరువు గట్టుపై అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టి.. పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
- వాస్తవంగా చెరువుగట్టుకు ఇరువైపులా కొంతమంది వ్యాపారులు భారీగా భవనాలు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొంతమంది తమ రాజకీయ పలుకుపడిని ఉపయోగించుకుని పక్కాగా షెడ్డులు నిర్మించుకున్నారు. వాటిని అద్దెలకు ఇచ్చి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో మక్కువ రోడ్డు పనులను వ్యతిరేకిస్తున్న కొంతమంది వ్యక్తులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువు ఆక్రమణలను తొలగించి.. ఆ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్, సులభ కాంప్లెక్సులు తదితర వాటిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు చెరువు ఆధునికీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మక్కువలో కాలువలను నిర్మించి రోడ్డును అభివృద్ధి చేస్తూనే ఆటోస్టాండ్‌తో పాటు ఆర్టీసీ బస్టాండ్, సులభ కాంప్లెక్సులు నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. ఏదేమైనా చెరువు ఆక్రమణల వివాదం ఏ విధంగా మారుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.