తరుగు.. ఆ దేవుడికే ఎరుగు!
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:33 AM
జిల్లా వ్యాప్తంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు సరఫరా చేస్తున్న బియ్యంలో తరుగు ఉంటుంది.
- డిపోలకు సరఫరా అవుతున్న రేషన్ బియ్యంలో కోత
- బస్తాపై ఆరేడు కిలోలు తక్కువ
-ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అక్రమాలు
- పక్కదారి పడుతున్న బియ్యం
- డీలర్ల నుంచి ఫిర్యాదుల వెల్లువ
- గజపతినగరం మండలం గంగచోళ్లపెంట రేషన్ డిపోకు ప్రతి నెలా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో తరుగు ఉంటుంది. బియ్యం బస్తా బరువు 50 కేజీలు ఉండాలి. కానీ, ఈ నెల వచ్చిన ఓ బస్తాను కాటవేస్తే 29.50 కేజీలు, మరో బస్తా 49. 50 కేజీలు ఉన్నాయి. ప్రతినెలా ఇలాగే బస్తాలు ఉంటున్నాయని, దీనివల్ల నష్టపోతున్నానని అధికారులు దృష్టిసారించి సక్రమంగా తూకం వేసి ఇవ్వాలని డీలరు రామినేని నాగరాజు కోరుతున్నాడు.
-గజపతినగరం మండలం కొత్తబగ్గాం రేషన్ డిపోకు కూడా ఇలాగే బియ్యం తక్కువగా వస్తున్నాయి. ప్రతి బస్తాలో సుమారు 2 నుంచి 5 కేజీల వరకు బియ్యం తక్కువగా ఉంటున్నాయని సంబంధిత డీలరు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి వాట్సాప్ గ్రూపులో ఓ పోస్టు పెట్టాడు.
విజయనగరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు సరఫరా చేస్తున్న బియ్యంలో తరుగు ఉంటుంది. ప్రతి బస్తాలో ఆరేడు కేజీల బియ్యం తక్కువగా ఉంటున్నాయి. ఈ తరుగు బియ్యం ఏమవుతున్నాయనే విషయం ఆ దేవుడికే తెలియాలి. ప్రధానంగా ఎంఎల్‌ఎస్ పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ కేంద్రాల సిబ్బంది తరుగు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 5.81 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరి కోసం ప్రతినెలా 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. ప్రతి రెండు, మూడు మండలాలకు కలిపి ఒక ఎంఎల్‌ఎస్ గోదాం ఉంది. ఇక్కడి నుంచే రేషన్ డిపోలకు బియ్యం వస్తుంటాయి. అయితే, ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వస్తున్న బియ్యం బస్తాల్లో 5 నుంచి 7 కిలోల తరుగు ఉంటుంది. వాస్తవానికి బస్తా 50కిలోలు ఉండాలి. గన్నీ సంచి బరువు 650 గ్రాములు ఉంటుంది. మొత్తం 50.650కిలోలు ఉండాలి. కానీ, కొన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ల రేషన్ షాపులకు వస్తున్న బియ్యం బస్తాల బరువు కేవలం 43 కిలోలు మాత్రమే ఉంటున్నాయి. ఆ భారం తమపై పడుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని సిబ్బందికి తెలియపర్చినా పట్టించుకోవడం లేదంటున్నారు. గోడౌన్‌లో ఎలుకలు సంచరించడం కారణంగా తరుగుదల వస్తున్నాయని సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఈ బియ్యం కోత ప్రభావం తమపై పడకుండా కొంతమంది డీలర్లు కార్డుదారులకు తక్కువగా తూస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
అవినీతిమయం..
జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఈ జాఢ్యం మరింత ఎక్కువైంది. గత ప్రభుత్వంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఓ అధికారి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత.. ఈ అవినీతి అధికారి విషయంలో విచారణకు ఆదేశించారు. గత ఏడాది వేసవిలో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్ మిల్లులను అక్కడి అధికారులు తనిఖీ చేశారు. 82.4 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్లను బట్టి అవి విజయనగరం పౌరసరఫరా గోదాముల నుంచి వచ్చినట్లుగా నిర్థారించారు. దీనిబట్టి ఏ స్థాయిలో బియ్యం పక్కదారి పడుతుందో అర్ధమవుతుంది. ఇప్పటికైనా ఎంఎల్‌ఎస్ పాయింట్లపై నిఘా పెట్టాల్సిన అవసరం యంత్రాంగంపై ఉంది.
నిఘా పెట్టాం..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్ గోదాములపై నిఘా పెట్టాం. బియ్యంలో తరుగు వస్తే ఊరుకునేది లేదు. ఒక వేళ ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వస్తే తిప్పి పంపిస్తాం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం నేరం. ఈ విషయంలో కఠినంగా ఉంటాం. కేసులు నమోదు చేస్తాం.
-బి.శాంతి, సివిల్ సప్లై సంస్థ మేనజర్, విజయనగరం