Share News

అంతా మాఇష్టం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:07 AM

రాజాం పట్టణానికి వర్తక, వాణిజ్యంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ షాపులకు చాలా గిరాకీ.

    అంతా మాఇష్టం
అనుమతులు లేకుండా షాపులను వ్యాపార సముదాయంగా మార్చేసిన దృశ్యం

- అద్దెకిచ్చిన షాపులను వ్యాపార సముదాయంగా మార్చిన వైనం

- ప్రభుత్వ ఆదాయానికి గండి

- 74 వరకూ దుకాణాలు ఉన్నా రాబడి అంతంతే

- రెండు దశాబ్దాలుగా కానరాని కార్యవర్గం

- ఇదీ రాజాం మునిసిపాలిటీలో పరిస్థితి

రాజాం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణానికి వర్తక, వాణిజ్యంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ షాపులకు చాలా గిరాకీ. ఓ దుకాణం నెలవారీ అద్దె రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ కొందరు వ్యక్తులు అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మునిసిపాలిటీకి చెందిన షాపులను తక్కువ అద్దెకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని వ్యాపార సముదాయంగా మార్చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రెండు దశాబ్దాలు దాటుతున్నా మునిసిపాల్టీకి కార్యవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు పరిస్థితి మారింది. అనేక వనరులు ఉన్నా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. అధికారుల అడ్డగోలు నిర్ణయాలు, నిర్లక్ష్యం మునిసిపాలిటీకి శాపంగా మారింది.

ఇదీ పరిస్థితి..

రాజాంలోని పాతం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మొత్తం 7 దుకాణాలను ముగ్గురు వ్యక్తులు ఇటీవల అద్దెకు తీసుకున్నారు. ఒక్కో షాపునకు రూ.4 వేల వరకూ అద్దె చెల్లిస్తున్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఆ షాపులను వ్యాపార సముదాయంగా మార్చేశారు. ఇదే ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద ఏడు షాపులను లీజుకు తీసుకుంటే మొత్తం నెలకు అద్దె రూ.లక్ష వరకూ ఉంటుంది. కానీ, కాంప్లెక్స్‌లోని దుకాణాలకు నెలకు రూ.28వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. మునిసిపల్‌ ఆదాయానికి గండికొడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- మునిసిపాలిటీకి పట్టణంలో విలువైన ఆస్తులు ఉన్నాయి. శ్రీనివాస, శ్రీసూర్య, అన్నపూర్ణ, రాజీవ్‌గాంధీ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 74 షాపులు ఉన్నాయి. గతంలో వీటి ద్వారా ఏడాదికి రూ.లక్షల్లో ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని షాపులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి. దీంతో అద్దెకు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గత 20 సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో వీటి గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. వాస్తవానికి రాజాంలో సగటున ఒక షాపు అద్దె నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకూ ఉంటుంది. ఈ లెక్కన 74 షాపుల నుంచి దాదాపు రూ.7 లక్షల ద్వారా ఆదాయం సమకూరాలి. కానీ, ఆ దిశగా మునిసిపాలిటీని ముందుకు తీసుకెళ్లే వారు కరువయ్యారు.

ఆర్టీసీకి ధారాదత్తం

పట్టణం నడిబొడ్డున మునిసిపాలిటీకి 1.42 ఎకరాల భూమి ఉంది. మునిసిపల్‌ అవసరాల కోసం ఈ భూమిని రిజర్వులో ఉంచారు. కానీ, ఆర్టీసీ విన్నపం మేరకు దశాబ్దం కిందట ఆ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించారు. ఈ స్థలం మార్కెట్‌ రేటు ప్రకారం దాదాపు రూ.30 కోట్ల పైమాటే. అయితే, ఈ ప్రాంత ప్రజల రవాణా అవసరాల కోసం డిపో ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో ఆ స్థలాన్ని కేటాయించారు. కానీ, ఇంతవరకూ డిపో ఏర్పాటు చేయలేదు. తిరిగి మునిసిపాలిటీకి స్థలం అప్పగించలేదు. ఇప్పటికైనా మునిసిపల్‌ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

చర్యలు తీసుకుంటాం

పాత ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న షాపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అద్దెకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. అందుకే ఏడు షాపులను ముగ్గురు వ్యక్తుల పేరున అద్దెకు ఇచ్చాం. అద్దె సక్రమంగానే కడుతున్నారు. అయినా ఏడు షాపులను ఒక షాపుగా మార్చడం తప్పే. ఈ విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

ఎ.రామచంద్రరావు, మునిసిపల్‌ కమిషనర్‌, రాజాం

Updated Date - Jul 10 , 2026 | 12:07 AM