It’s a sand mound in name only—it’s a sand hunt!పేరుకే మేట.. ఇసుక వేట!
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:10 AM
It’s a sand mound in name only—it’s a sand hunt! చిన్నపాటి నిబంధన వారికి కాసులు కురిపిస్తోంది. నాగావళి నదిలో మేట పేరుతో ఇసుక దందా సాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అనుమతులు కొంత అయితే.. అంతకు మించి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నాగావళి నదిని గుల్ల చేసి సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేరుకే మేట.. ఇసుక వేట!
నాగావళి నదిలో అక్రమ తవ్వకాలు
ఇసుక మేటల తొలగింపునకు అనుమతులు
నిబంధనలకు విరుద్ధంగా సేకరణ.... తరలింపు
చూసీచూడనట్టుగా అధికారులు
చిన్నపాటి నిబంధన వారికి కాసులు కురిపిస్తోంది. నాగావళి నదిలో మేట పేరుతో ఇసుక దందా సాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అనుమతులు కొంత అయితే.. అంతకు మించి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నాగావళి నదిని గుల్ల చేసి సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజాం, జూలై 21(ఆంధ్రజ్యోతి):
వంగర మండలం ఓని అగ్రహారం పరిధిలోని నాగావళి నదిలో ఇసుక మేటలు వేసిందని.. నీటి ప్రవాహ గమనంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి.. ఇసుక తొలగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఇసుక మేటల తొలగింపునకు సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి భూగర్భ గనుల శాఖ అనుమతులిచ్చింది. ఒక మీటరు లోతులో ఇసుక మేటలు తొలగించాలన్నది అనుమతి. అలా లక్షా 500 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిచ్చారు. కానీ అంతకుమించి తరలించుకుపోతున్నారు.
నాగావళి నదిలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా ఇసుక మేటలు తొలగించాలన్నది లక్ష్యం. కానీ దీనిని వ్యాపారంగా మార్చేసింది ఓ ప్రైవేటు సంస్థ. స్థానిక ఇసుక వ్యాపారులు, చోటా నాయకులు కుమ్మకై భారీ ఇసుక దందాకు తెరతీశారు. రాత్రీపగలూ అన్న తేడా లేకుండా యంత్రాలను వినియోగించి ఇసుక తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. వారి తీరుతో ఓని అగ్రహారం, మగ్గూరు. సంగాం గ్రామాల పరిధిలో నాగావళి నది ఆనవాళ్లు కోల్పోతోంది. నదీ తీరంతో పాటు గర్భంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. వాటిని చూస్తున్న తీర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గోతుల్లో పడి పశువులు, మనుషులు పడిపోతారన్న ఆందోళన కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అక్కడ అధికారుల పర్యవేక్షణ లేదు.
ప్రమాదంలో రక్షిత నీటి పథకం పైపులైన్లు
ఇసుక తవ్వకాలు చేపడుతున్న పరిసర ప్రాంతాల్లోనే 25 గ్రామాలకు తాగునీరు అందించే మెగా వాటర్ స్కీం ఉంది. రక్షిత పథకాల ఊటబావుల సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా.. పైపులైన్ల మీదుగా భారీ ఇసుక సామర్థ్యంతో లారీలు, ట్రాక్టర్లు వెళుతున్నాయి. దీంతో పైపులైన్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు ఇసుక మేటల తొలగింపులో ఎక్కడా డంప్ చేసేందుకు వీలుండదు. కానీ మడ్డువలస ప్రాజెక్టు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పదుల సంఖ్యలో లారీలతో తరలించి ఇసుకను నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి చీకటి మార్గంలో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకూ రాజాం నియోజకవర్గంలో ఇసుక దందా మకిలీ అధికార పార్టీకి అంటలేదు. కానీ ఇప్పుడు నాగావళి నదిలో ఇసుక మేటల పేరుతో జరుగుతున్న తవ్వకాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. కొందరు అధికారులు, చోటా నాయకుల సహకారంతోనే ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
అనుమతులున్నాయ్
ఇసుక మేటల తొలగింపునకు అనుమతులు ఉన్నాయి. అయితే అనుమతులకు మించి తవ్వకాలు చేపడితే మాత్రం చర్యలు తప్పవు. నిబంధనల మేరకు మాత్రమే తవ్వకాలు జరపాలి. డంప్ చేసేందుకు వీలులేదు. ఈ విషయంలో సిబ్బందిని పంపించి విచారణ చేపడతాం.
- పిన్నింటి రామారావు, తహసీల్దారు, వంగర