Share News

Encroach కాలువ అయితే మాకేంటి .. ఆక్రమిస్తాం.. కట్టేస్తాం!

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:25 AM

“It’s a Canal, So What? We’ll Encroach and Block It!” డివిజన్‌ కేంద్రం పాలకొండలో ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండాపోతుంది. వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా కొంతమంది ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఆర్టీసీ డిపో నుంచి చెక్‌పోస్టుసెంటర్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్లు పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలను సిమెంట్‌ దిమ్మలతో కప్పేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.

  Encroach  కాలువ అయితే మాకేంటి .. ఆక్రమిస్తాం.. కట్టేస్తాం!
కాలువలపై ఆక్రమణలతో ప్రధాన రహదారిపై నిలిచిన మురుగునీరు

  • ప్రధాన రోడ్డుపై కాలువను సిమెంట్‌ దిమ్మలతో కప్పేసి అక్రమంగా కట్టడాలు

  • షాపులు ఏర్పాటు చేసి అద్దెలకిస్తున్న వైనం

  • కుచించుకుపోతున్న రహదారి.. జటిలమవుతున్న ట్రాఫిక్‌ సమస్య

  • రోడ్డెక్కుతున్న మురుగు.. వర్షం పడితే ఇక అంతే..

  • పట్టించుకోని అధికారులు

పాలకొండ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): డివిజన్‌ కేంద్రం పాలకొండలో ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండాపోతుంది. వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా కొంతమంది ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఆర్టీసీ డిపో నుంచి చెక్‌పోస్టుసెంటర్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్లు పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలను సిమెంట్‌ దిమ్మలతో కప్పేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇలా ఏర్పాటు చేసిన దుకాణాలను అద్దె ప్రాతిపదికన చిరు వ్యాపారులకు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా ఆక్రమణదారులు సిఫారసులతో కాలువలపైనే అక్రమ కట్టడాలు చేపట్ట డంతో రోజురోజుకూ రహదారి మరింత ఇరుకుగా మారుతోంది. దీంతో ఈ రెండు కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతుంది. భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో అయితే వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. నగర పంచాయతీ, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా ఆక్రమణదారుల చర్యలతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా కాలువల్లో మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. వర్షపునీటితో పాటు మురుగునీరు కూడా రోడ్డెక్కడంతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ముంపులోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. రోజుల తరబడి ఈ నీరు అలానే ఉండిపోవడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా ఎక్కువవుతోంది. మరోవైపు ప్రధాన రహదారి కోతకు గురవుతోంది. వాస్తవంగా ఈ రహదారి గుండా నిత్యం వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన రహదారి విస్తరణ, ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని పాలకొండ వాసులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ నూకరాజును వివరణ కోరగా.. ‘ పాలకొండ ప్రధాన రహదారిలో కాలువపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. తొలుత నోటీసులిస్తాం. స్పందించకుంటే ఆర్‌అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆక్రమణలను తొలగిస్తాం. ’ అని తెలిపారు.

పోతులగెడ్డ కాలువనూ వదల్లే..

పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న పోతులగెడ్డ కాలువను సైతం ఆక్రమణదారులు వదల్లేదు. కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండగా.. మరోవైపు గెడ్డలో పూడికను అధికారులు తొలగించడం లేదు. పైగా పట్టణంలో చెత్తాచెదారమంతా ఇక్కడే వేస్తూ.. డంపింగ్‌యార్డుగా మారుస్తున్నారు. అయితే వర్షాలు కురిసే సమయంలో నీరు పారే అవకాశం లేక అది లోతట్టు ప్రాంతంలోని గారమ్మకాలనీకి చేరుతుంది. దీంతో ఆ కాలనీ రహదారులపై రోజుల తరబడి నీరు నిల్వ ఉండిపోవడంతో సుమారు రెండు వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తరచూ ఆ ప్రాంతవాసులు రోగాలపావుతున్నారు. పిచ్చిమొక్కలతో నిండి ఉన్న గెడ్డ నుంచి వర్షపునీటితో పాటు మురుగునీరు కాలనీలోకి చేరుతుండగా.. ఒక్కోసారి విషసర్పాలు, పురుగులు వస్తున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనను తట్టుకోలేకపో తున్నామని.. ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామని వారు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘పోతులగెడ్డలో పూడిక, పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. దీంతో వరదనీరు గెడ్డ ద్వారా ప్రవహించకుండా కాలువలోకి చొచ్చుకొస్తుంది. ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుని గారమ్మకాలనీలోకి నీరు ప్రవవహించకుండా అడ్డుకట్ట వేస్తాం. ఆక్రమణలను కూడా తొలగిస్తాం.’ అని నగర పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ హేమంత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 25 , 2026 | 12:25 AM