It's a big problem for the child. చిన్నారికి పెద్దకష్టం
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:21 AM
It's a big problem for the child. అమ్మఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఓ బుజ్జాయికి తెలీదు.. ప్రాణంతకమైన వ్యాధితో తాను జన్మించినట్లు. అమ్మానాన్నను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని, ఖరీదైన వైద్యం చేయిస్తే కానీ బతకనని కూడా తెలియదు. ఆ దంపతులు బాబును బతికించాలని తల్లడిల్లుతుంటే.. ఒడిలో అమాయకంగా చూడటం తప్ప ఏమీ తెలియని పరిస్థితి.
చిన్నారికి పెద్దకష్టం
ప్రాణాంతక వ్యాధితో రెండు నెలల బాలుడు
స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ టైప్ 1తో..
రూ.16 కోట్ల ఇంజక్షన్ వేస్తేనే బతికేది
లేకుంటే కష్టమంటున్న వైద్యులు
విజయనగరంలో మరో పునర్విక పోలిన పరిస్థితి
విజయనగరం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): అమ్మఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఓ బుజ్జాయికి తెలీదు.. ప్రాణంతకమైన వ్యాధితో తాను జన్మించినట్లు. అమ్మానాన్నను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని, ఖరీదైన వైద్యం చేయిస్తే కానీ బతకనని కూడా తెలియదు. ఆ దంపతులు బాబును బతికించాలని తల్లడిల్లుతుంటే.. ఒడిలో అమాయకంగా చూడటం తప్ప ఏమీ తెలియని పరిస్థితి. విజయనగరంలో ఓ బాబుకు పునర్వికలాంటి కష్టం ఎదురైంది. ఈ చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే కానీ బతకడని చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. తమ బాధను మీడియా ద్వారా ప్రభుత్వంతో పాటు దాతలకు విజ్ఝప్తి చేశారు. విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన వెంకటేష్, అనూష దంపతులకుఈ ఏడాది ఫిబ్రవరి 4న రెండో కుమారుడు జన్మించాడు. నెల రోజుల తరువాత బాబులో క్రమేపీ కదలికలు తగ్గాయి. చేతులు, కాళ్లు సరిగ్గా కదపలేకపోయాడు. ఎత్తుకుంటే శరీరం పూర్తిగా వాలిపోవడం ప్రారంభం అయింది. దీంతో తల్లిదండ్రులు వైద్యులను ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ టైప్ 1 (ఎస్‌ఎంఏ టైప్1) ఉన్నట్టు తేలింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఒకటైన ‘జోల్జెన్మ్సా’ ఇంజక్షన్ ఒక్కటే బాబును సాధారణ స్థాయికి తీసుకురాగలదు. దీని ఖరీదు రూ.16 కోట్లు. ప్రస్తుతానికి చిన్నారికి ఊపిరితిత్తుల సమస్య తలెత్తకుండా వైద్యం అందిస్తున్నారు. వ్యాధి తీవ్రతను తాత్కాలికంగా తగ్గించేందుకు మందులు వాడుతున్నారు. బాబు పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే ఖరీదైన ఇంజక్షన్ ఒక్కటే మార్గం. ఇందుకోసం తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.25 లక్షల వరకూ సమకూరింది. మరోవైపు ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజస్ ఇండియా (ఓఆర్‌డీఐ) అనే స్వచ్ఛంద సంస్థ చిన్నారి దయనీయ పరిస్థితిని అమెరికాలోని నోవార్టిస్ కంపెనీని సంప్రదించింది. రూ.9.50 కోట్లకే ఇంజక్షన్ అందించేందుకు సమ్మతించింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. బాబును అదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆదితి గజపతి రాజు.. మంత్రి నారాలోకేష్‌కు మెయిల్ ద్వారా కోరారు.
తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు..
తమ చిన్నారిని మంత్రి నారా లోకేష్ ఆదుకోవాలని తల్లిదండ్రులు వెంకటేష్, అనూష విజ్ఞప్తి చేస్తున్నారు. వారు విజయనగరంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోపు రూ.16 కోట్ల ఇంజక్షన్ వేస్తేనే చిన్నారి బతుకుతాడని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రైవేటు ఉద్యోగం చేసే తనకు ఆ ఇంజక్షన్ కొనుగోలు చేసే స్థోమత లేదని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పునర్విక మాదిరిగా తమ బాబును కూడా బతికించాలని కోరారు.