It will be difficult if the vacancies are not filled. భర్తీ చేయకుంటే కష్టమే
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:21 PM
It will be difficult if the vacancies are not filled. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో పాటు పర్యవేక్షించే అధికారులు లేరు. అసిస్టెంట్ లైన్‌మన్లు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, ఏడీల కొరత అధికంగా ఉంది. పదవీవిరమణతో చాలా పోస్టులు ఖాళీ అవుతున్నా భర్తీ చేయడం లేదు. అటు బదిలీలు, పదోన్నతులతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.
భర్తీ చేయకుంటే కష్టమే
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత
తరచూ సాంకేతిక సమస్యలు
సరఫరాలో అనధికారిక కోతలు
సకాలంలో దొరకని పరిష్కారం
రాజాం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో పాటు పర్యవేక్షించే అధికారులు లేరు. అసిస్టెంట్ లైన్‌మన్లు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, ఏడీల కొరత అధికంగా ఉంది. పదవీవిరమణతో చాలా పోస్టులు ఖాళీ అవుతున్నా భర్తీ చేయడం లేదు. అటు బదిలీలు, పదోన్నతులతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులకు అత్యవసర సేవలు అందడం లేదు. అటు పాడైన విద్యుత్ పరికరాలతో సిబ్బంది కుస్తీలు పట్టాల్సి వస్తోంది. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో మూడు విద్యుత్ డివిజన్లు కొనసాగుతున్నాయి. గృహ వినియోగానికి సంబంధించి 5,97,245, వాణిజ్య కనెక్షన్లు 64,407, వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి 40.386, పరిశ్రమలకు 2,506 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా మొత్తాన్ని ఎస్‌ఈ పర్యవేక్షిస్తారు. డివిజన్, సబ్ డివిజిన్లను డీఈఈ, ఏడీఈ పర్యవేక్షిస్తారు. మండలస్థాయిలో ఏఈలదే కీలక పాత్ర. లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, అసిస్టెంట్ లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఏడీలు పూర్తిస్థాయిలో ఉన్నారు. ఏఈలు 51 మందికిగాను 32 మంది ఉన్నారు. 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎల్‌ఎంలు 186 మందికిగాను కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. జేఎల్‌ఎంలు సీనియర్ లైన్‌మెన్లుగా, లైన్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. వారి స్థానంలో ఇంతవరకూ కొత్తవారి నియామకాలు లేవు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు 413 మంది ఉండాలి ప్రస్తుతం 348 మంది ఉన్నారు. ఇంకా 65 వరకూ ఖాళీలు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాకు 258 మంది అవసరం. ఒక్కో మండలంలో 50కు మించి రెవెన్యూ గ్రామాలుంటాయి. కానీ ఒకరిద్దరు లైన్‌మెన్లు మాత్రమే ఉన్నారు. కొన్ని మండలాల్లో అయితే పూర్తిగా లేరు. దీంతో లైన్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లతో పనులు చేయిస్తున్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, మొండిబకాయిల వసూలు, విద్యుత్ మరమ్మతుల పనుల్లో పనిభారం ఎదుర్కొంటున్నారు.
ఏఈలు లేక..
జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, మూడు మునిసిపాల్టీలు ఉన్నాయి. 12 వరకూ మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ అర్బన్‌తో పాటు రూరల్ ఏఈలు ఉండాలి. ఇటువంటి చోట మండలానికి ఒక్క ఏఈకే పరిమితం చేస్తున్నారు. దీంతో పర్యవేక్షక బాధ్యతలు కరువవుతున్నాయి. జిల్లాలో వందకుపైగా సబ్ స్టేషన్లు ఉన్నాయి. మరికొన్నిచోట్ల ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకూ షిప్ట్ ఆపరేటర్లుగా ఉన్నవారు సచివాలయ లైన్‌మెన్లుగా నియమితులయ్యారు. దీంతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి నియామకంలో రాజకీయ జోక్యం ఉండడం వల్ల ఖాళీగా విడిచిపెడుతన్నారు. ఈ పోస్టుకు రూ.లక్షలు పలుకుతుండడంతో నేతలు పోటీపడుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారు. ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది.
సిబ్బంది కొరత వాస్తవమే
జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాం. సిబ్బంది కొరత మాట వాస్తవమే. అయినా ఉన్న సిబ్బందితో పనిచేయిస్తున్నాం. జిల్లాలో అన్నిరకాల పోస్టులు కలిపి 258 ఖాళీలు ఉన్నాయి. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. సిబ్బంది కొరత అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు సైతం మంచి సేవలు అందిస్తున్నారు.
- లక్ష్మణరావు, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, విజయనగరం