Share News

It seems there used to be a place called Narayanavanam!నారాయణవనం ఉండేదట!

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:31 AM

It seems there used to be a place called Narayanavanam! బొబ్బిలి పట్టణానికి కూతవేటు దూరంలో ఎన్నో తరాల గ్రామీణులతో ఉన్న అనుబంధం నారాయణ వనం. ఇప్పుడీ పేరునే మర్చిపోయిన పరిస్థితి నెలకొంది. వలసదారుల ఆక్రమణలో నారాయణ వనం కనుమరుగైంది. రికార్డులకే పరిమితమైంది.

It seems there used to be a place called Narayanavanam!నారాయణవనం ఉండేదట!
కబ్టాదారులు పండిస్తున్న మొక్కజొన్న, ఇతర పంటలు

నారాయణవనం ఉండేదట!

ఆక్రమణలతో కనుమరుగైన అటవీ ప్రాంతం

ఆనవాళ్లు కూడా కనిపించని వైనం

వాణిజ్య పంటలు వేసుకుంటున్న ఆక్రమణదారులు

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణానికి కూతవేటు దూరంలో ఎన్నో తరాల గ్రామీణులతో ఉన్న అనుబంధం నారాయణ వనం. ఇప్పుడీ పేరునే మర్చిపోయిన పరిస్థితి నెలకొంది. వలసదారుల ఆక్రమణలో నారాయణ వనం కనుమరుగైంది. రికార్డులకే పరిమితమైంది. మల్లంపేట, గోపాలరాయుడుపేట, బొడ్డవలస గ్రామీణ ప్రాంతాల ప్రజలతో చిరకాల అనుబంధం ఉండే నారాయణవనం పూర్తిగా వలసదారుల ఆక్రమణలో ఉంది. వారి తీరుతో వేలాది జీవజాతుల మనుగడా లేదు. చెట్టు పుట్టా లేని నేలను వనంగా పిలుస్తున్నాం తప్ప అక్కడ ప్రస్తుతం అడవులు లేవు. లేకుండా చేసేశారు. అటవీశాఖలోని అధికారుల అలసత్వం, స్వార్థం ఈ పరిస్థితికి కారణమని ఆయా గ్రామాల ప్రజలు బహాటంగానే చెబుతున్నారు.

మండలంలోని గోపాలరాయుడుపేట, బొడ్డవలస, మల్లంపేట గ్రామాల మధ్య ఉన్న చింపికొండ, సూదికొండ, అడ్డుకొండల మధ్య ప్రాంతాన్ని నారాయణ వనం అని పిలిచేవారు. నాడు కర్ర పొయ్యిల కోసం అడవిలో ఎండిపోయిన చెట్లకొమ్మలను సేకరించి కుప్పలుగా ఏర్పాటు చేసి ఏడాది పొడువునా వాటిని వినియోగించేవారు. అప్పట్లో ఇక్కడ ఎలుగుబంట్లు, బౌరుపిల్లులు, నక్కలు వంటి ఎన్నో రకాల జీవజాతులు నివాసం ఉండేవి. అప్పుడప్పుడు సమీప గ్రామాల్లోకి వచ్చేవి. ఆ జీవజాతుల పేర్లు కూడా నేటి తరం యువకులు మర్చిపోయిన పరిస్థితి. అంటే ఎంత వినాశనం జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. వందలాది ఎకరాల్లో అటవీ చెట్లను నరికి పూర్తిగా స్వాఽధీనం చేసుకుంటున్నారు. ఎక్కడినుంచో వచ్చిన వలసదారుల కబ్జాలకు అడవి కుచించుకు పోయింది. దాదాపు 450 హెక్టార్లలో అటవీ సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం సుమారు 5 గ్రామాల (కృపావలస, దీవెన వలస, అక్కేనవలస, కొత్తవలస, కేశాయివలస) వలసదారుల ఆక్రమణలో దాదాపు 200 ఎకరాలకు పైబడి ఉంది. ఈ గ్రామాల పేర్లు కూడా రికార్డుల్లో లేవని సమాచారం. అటవీ భూముల్లో ఇష్టారాజ్యంగా.. వాణిజ్య పంటలైన మొక్కజొన్న, ఉలవలు, కందులు తదితర పంటలు పండించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు నోటీసులతో సరిపుచ్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు, బీట్‌ అధికారులు, వాచర్లు ఏమి చేస్తున్నారన్న సందేహం ఆయా గ్రామాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది ఈ విషయంపై బొబ్బిలి డివిజన్‌ బీట్‌ అధికారి స్వప్నని వివరణ కోరగా ప్రభుత్వానికి తెలియజేశామని, వాణిజ్య పంటలు వేయకూడదని ఎందుకు వేస్తున్నారో తెలియదని అన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:31 AM