Share News

We Recommend మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:00 AM

It Must Be Given Only to Those We Recommend ‘మేం చెప్పినోళ్లకే పోస్టులు ఇవ్వాలి.. మేము సూచించిన మేరకు జాబితాలో మార్పు చేయాల్సిందే.’ అంటూ అంగన్‌వాడీల పోస్టుల భర్తీ విషయంలో కొందరు ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ వ్యవహారం కొలిక్కి రావడం లేదు.

 We Recommend  మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి

  • అధికారుల జాబితాను తిరస్కరించిన కొందరు ఎమ్మెల్యేలు

  • తమ సూచన మేరకు మార్పు చేయాల్సిందేనంటూ ఒత్తిళ్లు

  • ఇంటర్వ్యూలు జరిగి మూడునెలలైనా తేలని పంచాయితీ

  • నియామక పత్రాల కోసం అభ్యర్థుల ఎదురుచూపు

పార్వతీపురం, ఆగస్టు28(ఆంధ్రజ్యోతి): ‘మేం చెప్పినోళ్లకే పోస్టులు ఇవ్వాలి.. మేము సూచించిన మేరకు జాబితాలో మార్పు చేయాల్సిందే.’ అంటూ అంగన్‌వాడీల పోస్టుల భర్తీ విషయంలో కొందరు ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి మూడు నెలలవుతుండడంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మన్యంలో ఐదు అంగన్‌వాడీ కార్యకర్తలు, 258 సహాయకుల పోస్టులకు ఈ ఏడాది మే 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే మూడు నెలలు గడుస్తున్నా.. ఫలితాలు వెల్లడించలేదు. నేటికీ నియామక పత్రాలూ అందించలేదు. అభ్యర్థుల జాబితాను గోప్యంగా ఉంచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంగవాడీ పోస్టుల వ్యవహారంలో పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్వ్యూలకు ముందే కొంతమంది అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా పైరవీలు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తాము సూచించిన అభ్యర్థులకే పోస్టింగ్‌లు ఇవ్వాలని కొంతమంది ప్రజా ప్రతినిధులు పట్టుబడుతున్నారు. అయితే అధికారులు ఓ జాబితాను తయారు చేయగా.. దానిని కొందరు ప్రజా ప్రతినిధులు తిరస్కరించినట్లు తెలిసింది. వాస్తవంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని భావించారు. దీనిపై సీడీపీవోల ద్వారా ఎమ్మెల్యేలకు ఆహ్వానం వెళ్లింది. అయితే తాము రాలేమని వారు చెప్పడంతో నియామకపత్రాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని సమాచారం. ప్రజాప్రతినిధులు సూచించిన వారి పేర్లు లేకపోవడంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గను వివరణ కోరగా.. ‘ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే.. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఈ ప్రక్రియలో ఎవరి జోక్యం లేదు. ఎటువంటి అవకతవకలు జరగలేదు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. దీనిపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మెరిట్‌ ప్రకారమే నియామకపత్రాలు అందిస్తాం’ అని తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 12:00 AM