It has to be given as 'money' అ‘ధనం’గా ఇచ్చుకోవాల్సిందే
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:47 PM
It has to be given as 'money' జిల్లాలో ఎలక్ర్టానిక్ స్టాంపులకు కృత్రిక కొరత సృష్టిస్తున్నారు. వీటిని సరఫరా చేసే సంస్థ ప్రతినిధులు, స్టాంప్స్ వెండర్లు కలసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. కొరతను బూచిగా చూపించి ఇష్టారాజ్యంగా విక్రయాలు చేస్తున్నారు. ఈ విధంగా నెలకు లక్షలాది రూపాయల మేర అక్రమాలు బాహాటంగానే జరుగుతున్నా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. పది, ఇరవై, యాభై రూపాయల స్టాంపులు అడిగితే లేవంటున్నారు.
అ‘ధనం’గా ఇచ్చుకోవాల్సిందే
ఈ-స్టాంపులకు కృత్రిమ కొరత
పది, ఇరవై, యాబై రూపాయల స్టాంపులు ఇవ్వని వెండర్లు
అసలు ధరకు మూడురెట్లు పెంచి అమ్మకాలు
నష్టపోతున్న వినియోగదారులు
కొరతను బూచిగా చూపించి ఇష్టారాజ్యంగా విక్రయాలు
అరకొర స్టాంప్‌లు సరఫరా చేస్తున్నారంటున్న వెండర్లు
అధికారుల తీరుపై బాధితుల్లో అనుమానాలు
జిల్లాలో ఎలక్ర్టానిక్ స్టాంపులకు కృత్రిక కొరత సృష్టిస్తున్నారు. వీటిని సరఫరా చేసే సంస్థ ప్రతినిధులు, స్టాంప్స్ వెండర్లు కలసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. కొరతను బూచిగా చూపించి ఇష్టారాజ్యంగా విక్రయాలు చేస్తున్నారు. ఈ విధంగా నెలకు లక్షలాది రూపాయల మేర అక్రమాలు బాహాటంగానే జరుగుతున్నా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. పది, ఇరవై, యాభై రూపాయల స్టాంపులు అడిగితే లేవంటున్నారు.
మెంటాడ, ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి):
అక్రమార్జనపై రుచిమరిగిన కొందరు ఈ-స్టాంప్ వెండర్లు నాన్ జ్యుడీషియల్ స్టాంపులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక కూడా దోపిడీని యథాతథంగా కొనసాగిస్తున్నారు. కొరతను బూచిగా చూపించి ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడుతున్నారు. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత, దుర్వినియోగంపై విమర్శలు, ఆరోపణలు రావడంతో వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపుల విధానాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిని సరఫరాచేసే బాధ్యతను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు కట్టబెట్టింది. అనంతరం ఈ సంస్థ స్టాంపు వెండింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా లెక్కకుమిక్కిలిగా వచ్చాయి. వాటిలో మదింపు చేసి కొందరికి లైసెన్సులు జారీచేసింది. కాగా అప్పటికే ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంపుల లైసెన్స్ హోల్డర్లు, బ్యాంకర్లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులతోపాటు ప్రైవేటు వ్యక్తులు ఈ-స్టాంపుల లైసెన్సు పొందినవారిలో ఉన్నారు. వీరిలో కొంతమంది లైసెన్సు పొందిందే తడవుగా అప్పటికే కొనసాగుతున్న నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతను అదనుగా చేసుకొని దోపిడీరాజా అవతారమెత్తారు. అవతలివారి అవసరాన్ని అవకాశంగా మలుచుకొని, డిమాండును బట్టి ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. కొన్ని అత్యవసర సందర్భాల్లో స్టాంపు విలువకు మూడునాలుగు రెట్లు అదనంగా అమ్మకాలు సాగించిన సందర్భాలూ ఉన్నాయి. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత కారణంగా వ్యాపార లావాదేవీలు ఆగిపోకూడదని భావించేవారు వెండర్లు చెప్పినంత ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకూ ఈ దోపిడీ కట్టడి కావడం లేదు.
పైసలిస్తే ఎన్ని అయినా..
ఈ-స్టాంప్ విధానం ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో చిన్నచిన్న అవసరాలకు కావలసిన 10, 20, 50 రూపాయల ఈ-స్టాంపుల కొరత రూపంలో వినియోగదారులకు కొత్త సమస్య ఎదురవుతోంది. వీటికోసం ఈ-స్టాంప్స్ వెండర్లను సంప్రదిస్తే ముక్కుపిండి మూడు రెట్లు అదనపు ధర వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే డిమాండ్ మేరకు చిన్న స్టాంపుల సరఫరా జరగడంలేదని, అందరికీ సర్దుబాటు చేయాలంటే ఈ విధానం తప్పడం లేదని దోపిడీని సమర్థించుకుంటున్నారు. పది, ఇరవై, యాబై రూపాయల స్టాంపులు విక్రయించవద్దనే ఆదేశాలు ఉన్నాయని కూడా సెలవిస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికి మాత్రం కావలిసినన్ని స్టాంపులు విక్రయిస్తున్నారు.
వెండర్లకూ ఇబ్బందులు
స్టాంపుల కొరతపై లోతుగా ఆరాతీస్తే నిజమేనని రూడీ అవుతోంది. వెండర్లు చేసే వ్యాపారాన్ని బట్టి ఏ వెండర్‌కు ఎన్ని బాండ్లు ఇవ్వాలనేది ఆన్లైన్లో చూపుతుండగా, ఆ మేరకు సంస్థ స్టాంపు వెండర్లుకు బాండ్లు సరఫరా చేయడం లేదు. బాండ్లు తగ్గించి ఇస్తూ ప్రభుత్వానికి ఆదాయం పెంచాలని టార్గెట్ విధిస్తున్నారని వెండర్లు వాపోతున్నారు. చిన్న స్టాంపుల విక్రయాలు తగ్గించాలని చెప్పడం నిజమేనని సంస్థ ప్రతినిధులు అంగీకరించడం ఇక్కడ గమనార్హం.
ఫ ఇదిలా ఉంటే కొందరు ఈ-స్టాంప్స్ వెండర్లు తమ ప్రాంతంలోని వ్యక్తులతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని వారికి గంపగుత్తగా స్టాంపులను మళ్లించి, ఎవరైనా ప్రశ్నిస్తే కొరతను బూచిగా చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదులు అందాయి.
ఈ-స్టాంపుల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు కోకొల్లలుగా అందుతున్నాయి. కొందరు రాతపూర్వకంగా మా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అంతర్గత విచారణ చేపడుతున్నాం. ఆరోపణలు రుజువైతే లైసెన్సు రద్దుచేసేందుకు ఏమాత్రం ఆలోచించం. ప్రభుత్వానికి ఆదాయం పెంచాలని, చిన్న స్టాంపుల అమ్మకాలు తగ్గించాలని మాత్రమే చెప్పాం. అడిగిన వారికి చిన్న స్టాంపులు విక్రయించాలి. వెండర్లకు ఇచ్చే ఒక్కో బాండ్ పేపర్‌కు రూ.2 ఖర్చు అవుతుంది. దానిని ఏజెన్సీ భరిస్తుంది. ఇండెంట్ మేరకు బాండ్లు సరఫరా చేస్తున్నాం.
- విశ్వనాథరెడ్డి, రీజనల్ మేనేజర్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం.
---------------------