రబీకి ఇబ్బంది తప్పదా?
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:23 AM
ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే ఖరీఫ్ సాగు ముందుకు కదలడం లేదు.
- పొంచిఉన్న ఎల్‌నినో ముప్పు
- ఇప్పటికే ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం
- వర్షాలు కురవకపోవడంతో తగ్గిన సాగు
- ఇదే పరిస్థితి రబీలో కూడా ఉంటుందని అంచనా
విజయనగరం రూరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే ఖరీఫ్ సాగు ముందుకు కదలడం లేదు. ఖరీఫ్ సీజన్ పూర్తికావస్తున్నా, వర్షాలు పూర్తిస్థాయిలో పడకపోవడంతో రైతులు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సాగునీటి కాలువలు, బోర్లు ఉన్న ప్రాంతాల్లోనే పంటలు వేశారు. ఇదే పరిస్థితి రబీ సీజన్‌లో కూడా తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌నకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో లోటు వర్షపాతం నమోదైంది. పైగా గత వారం రోజుల నుంచి వేసవిని తలపించే విధంగా ఎండల తీవ్రత ఉండడంతో పంట భూములు ఎండిపోతున్నాయి. జిల్లాలో రబీ సీజన్ అక్టోబరు 15 నుంచి ఫిబ్రవరి 15 వరకూ ఉంటుంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలలో కొద్ది పాటి వర్షం కురిసినా, రైతాంగం రబీ పంటకు సిద్ధమయ్యేది. దీనికి కారణం అక్టోబరు, నవంబరులో తుఫాన్‌లు, అల్పపీడనాల ప్రభావంతో వానలు పడతాయనే నమ్మకం. అయితే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఇక రబీ విషయలో ఖరీఫ్ పరిస్థితే ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వాతావరణ నిపుణులు, వ్యవసాయశాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రబీకి సంబంఽధించి మినుములు 25 వేల ఎకరాలు, పెసర 25వేల ఎకరాలు, 65వేల ఎకరాల్లో మొక్కజొన్నను ప్రతి ఏటా రైతాంగం వేసేది. ఈ ఏడాది సెప్టెంబరు నెల ప్రారంభమై నాలుగు రోజులవుతున్నా వర్షం జాడ కన్పించలేదు. సెప్టెంబరు, అక్టోబరు నెలలో సాధారణ వర్షపాతం 200 మిల్లీ మీటర్ల చొప్పున పడాల్సి ఉంది. సెప్టెంబరులో 200 మిల్లీ మీటర్లు వర్షం కురిస్తేనే రబీ పంటలకు రైతులు సిద్ధపడతారు.
వర్షాలు కురిస్తే ఇబ్బంది ఉండదు..
ఖరీఫ్ ఈ ఏడాది రైతులను నిరాశ పరిచింది. రబీ సీజన్ అక్టోబరు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో 200 మిల్లీమీటర్లు వర్షం పడితే రైతాంగం రబీకి సిద్ధం కావచ్చును. సెప్టెంబరు తొలి వారంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుని వర్షాలు విస్తృతంగా కురిస్తే, రబీకి ఇబ్బంది ఉండదు. లేదంటే.. రెగ్యులర్ పంటలు కాకుండా, ప్రత్యామ్నాయ పంటల వైపే చూడాల్సి వస్తుంది.
-కె.లక్ష్మణ్, కో-ఆర్డినేటర్, ఏరువాక కేంద్రం, విజయనగరం