Share News

Tourism పర్యాటకం పట్టదా?

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:33 AM

Is Tourism Not Taking Off? ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. ప్రకృతి సహజసిద్ధ అందాలకు నిలయం మన్యం జిల్లా. మనసు దోచే ప్రదేశాలు.. ఆధ్యాతిక, పర్యాటక ప్రాంతాలకు కొదవ లేకపోయినా.. ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగడం లేదు.

  Tourism   పర్యాటకం పట్టదా?
అభివృద్థికి నోచని బెన్నరాయి జలపాతం

  • జలపాతాల వద్ద వసతులు కరువు

  • మోకాలడ్డుతున్న అటవీశాఖ

  • ఏటా తగ్గుతున్న సందర్శకుల సంఖ్య

  • పట్టించుకోని అధికారులు

  • నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

సీతంపేట, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. ప్రకృతి సహజసిద్ధ అందాలకు నిలయం మన్యం జిల్లా. మనసు దోచే ప్రదేశాలు.. ఆధ్యాతిక, పర్యాటక ప్రాంతాలకు కొదవ లేకపోయినా.. ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగడం లేదు. ఏజెన్సీలో పర్యాటక ప్రగతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తున్నా.. క్షేత్రస్థాయిలో శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు సౌకర్యాల లేమి వల్ల మన్యానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా తగ్గుతోంది. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనం.

సౌకర్యాలు లేక..

సీతంపేట ఏజెన్సీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌, మెట్టుగూడ జలపాతం, ఆడలి, జగతిపల్లి వ్యూపాయింట్‌ను అన్ని విధాలుగా అభివృద్థి చేశారు. దీంతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు సీతంపేట ఐటీడీఏకు కూడా అధికంగానే ఆదాయం వచ్చింది. అయితే పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించడంలో ఐటీడీఏ విఫలమైందనే చెప్పాలి. సాహసోపేతమైన క్రీడలు, రాత్రిబస (నైట్‌హాల్ట్‌)చేసేందుకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే ఐటీడీఏ పరిధిలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సందడిగా ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ఇదే సమయంలో ఐటీడీఏకు ఆదాయం తగ్గుతోంది.

- ఐటీడీఏకు ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చే ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో పర్యాటకుల కోసం సుమారు రూ.15లక్షలు వెచ్చించి గతంలో పారాగ్లైడింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశారు. అయితే నిర్వహణ లేక మరమ్మతులకు గురై మూలకుచేరింది. ఆల్‌టెర్రయిన్‌ వాహనాలు ఇటీవలే మొరాయించడంతో వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. చిన్నారులను ఆకర్షించే బుల్‌రైడ్‌, కిట్స్‌ బోటింగ్‌ వంటి ఈవెంట్‌లకు సంబంధించిన యంత్రాలకు కూడా రిపేరు చేయించాల్సి ఉంది.

- మెట్టుగూడ జలపాతంలో కూడా పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఎటువంటి ఈవెంట్‌లు ఏర్పాటుచేయడం లేదు. వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో జలపాతంలో పుష్కలంగా నీరు ఉండకపోవడం వంటి కారణాలతో పర్యాటకులు తరుచూ ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

- వాస్తవంగా పై రెండు పర్యాటక ప్రాంతాల నుంచి సీజన్‌లో ఒక్కరోజు వచ్చే ఆదాయం రూ.3.50లక్షలకు పైగా ఉంటుంది. మరి ఇంత ఆదాయానిచ్చే ఈ ప్రాంతాలను ఎందుకు అభివృద్థి చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రతిపాదనలకు ఏడాది..

సీతంపేటలో ఎన్టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌ అభివృద్ధి, మెట్టుగూడ జలపాతం వద్ద వసతుల కల్పనకు గత ఏడాది రూ.1.50కోట్లతో ఐటీడీఏ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్‌(డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)తో ప్రతిపాదనలు పంపారు. అయితే జీవో వచ్చినా.. ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో ఈ రెండు పర్యాటక ప్రదేశాలు అభివృద్థికి నోచుకోక పర్యాటకులను ఆకర్షించలేక పోతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- సీతంపేట ఏజెన్సీలో సున్నపుగెడ్డ, బెన్నరాయి, మల్లెమ్మతల్లి, ఈతమానుగూడ జల పాతాలతో పాటు పొల్ల వ్యూపాయింట్‌ను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ఈ పర్యాటక ప్రదేశాలన్నీ రిజర్వ్‌ ఫారెస్ట్‌(ఆర్‌ఎఫ్‌)పరిధిలో ఉన్నాయి. దీంతో అటవీశాఖ మొకాలడ్డు తుండగా.. పర్యాటల ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ కూడా ముందుకు రావడం లేదు.

- రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. ఇటీవల సున్నపుగెడ్డ జలపాతం ప్రవేశ మార్గంలో ఆ శాఖ ఉడెన్‌ ఆర్చ్‌ నిర్మాణంతో పాటు రాతికట్టుతో రహదారి, పర్యాటకుల సేదతీరేందుకు వెదురుబొంగులు, చెక్కలతో బెంచీలను ఏర్పాటుచేసింది.

- ఇక ఆర్‌ఎఫ్‌లో పరిధిలో ఉన్న బెన్నరాయి, మల్లెమ్మతల్లి, ఈతమానుగూడ, పొల్ల వ్యూ పాయింట్‌ అందాలను తీర్చిదిద్దేందుకు అటవీశాఖ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- సీతంపేట ఏజెన్సీలోని ప్రకృతి అందాలను పరిరక్షించి.. పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతం మరో ఊటీ, అరకు వంటి ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోదనేది కాదనలేని వాస్తవం. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గిరిజన గ్రామాలు కూడా ప్రగతి సాధిస్తాయని వారు చెబుతున్నారు.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, ఎఫ్‌ఆర్‌వో ఏమన్నారంటే...

‘సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెట్టుగూడ జలపాతంతో పాటు ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది. పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం.’అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. ‘ సున్నపుగెడ్డ జలపాతం అందాలను తీర్చిదిద్దే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల అభివృద్థిపై ప్రభుత్వానికి నివేదించాం.’ అని ఎఫ్‌ఆర్‌వో లక్ష్మీనర్సు తెలిపారు.

Updated Date - Sep 27 , 2026 | 12:33 AM