Share News

Shirivara Road శిరివర రోడ్డు పనులు ఇలాగేనా?

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:20 AM

Is This How Shirivara Road Works Are Being Done? గిరిశిఖర గ్రామం చెలకమెండంగి-శిరివర బీటీ రోడ్డు నిర్మాణాన్ని పునఃప్రారంభించకపోవడంపై ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. రూ.2.40 కోట్ల వరకు బిల్లులు పొందినా రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

 Shirivara Road  శిరివర రోడ్డు పనులు ఇలాగేనా?
రోడ్డుపనుల నాణ్యతాప్రమాణాలు తనిఖీ చేస్తున్న ఐటీడీఏ పీవో వైశాలి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

పార్వతీపురం/మక్కువ, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామం చెలకమెండంగి-శిరివర బీటీ రోడ్డు నిర్మాణాన్ని పునఃప్రారంభించకపోవడంపై ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. రూ.2.40 కోట్ల వరకు బిల్లులు పొందినా రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల ఈ రోడ్డు పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. బుధవారం బాగుజోల నుంచి చెలకమెండంగి, శిరివర గ్రామాల వరకు చేపట్టిన బీటీ రోడ్ల పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు శిరివర రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా.. ప్రజలు నడిచి వెళ్లేందుకు కూడా వీలులేని విధంగా తయారవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను సకాలంలో పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు మక్కువలో రూ.2.65కోట్లతో చేపడుతున్న కాలు వలు, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌, అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సర్‌ ప్రక్రియపై సమీక్షించారు. వర్షాలకు కొంత భాగం కొట్టుకుపోయిన రహదారి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని పార్వతీపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌ తెలిపారు. ఈ రోడ్డుకు సంబంధించి ఇంకా బిల్లులు చెల్లింపులు చేపట్టలేదన్నారు. ఆమె వెంట ఈఈ రాజు, డీఈఈ మణిరాజు, ఏఈ సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు తదితరులు ఉన్నారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

సాలూరు, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. పక్కాగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బుధవారం సాలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవో, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసుల డెలివరీ, ఫారాల స్వీకరణ, పరిశీలన, డిస్పోజల్‌ ప్రక్రియపై చర్చించారు. నిర్ణీత గడువులోగా సర్‌ ప్రక్రియను పూర్తిచేయాలని ఆమె సూచించారు. అనంతరం డీటీ, మండల సర్వేయర్‌లతో రీసర్వే పనుల పురోగతిపై సమీక్షించారు. మండలాల వారీగా సర్వే పురోగతిని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Updated Date - Aug 20 , 2026 | 12:20 AM