రోడ్లు నిర్మించేది ఇలాగేనా?
ABN , Publish Date - May 08 , 2026 | 12:43 AM
గిరిశిఖర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.
- పనుల్లో నాణ్యతా లోపం
- నిర్మాణాలు పూర్తికాకుండానే కోతకు గురైన వైనం
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- ఇదీ గిరిశిఖర రహదారుల పరిస్థితి
మక్కువ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలతో రోడ్లు నిర్మిస్తోంది. అయితే, పనుల నిర్వహణపై కొందరు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పనుల నాణ్యతను పట్టించుకోవడం లేదు. దీంతో పనులు పూర్తికాకుండానే శిథిలమై వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచినట్లు అవుతుంది.
ఇదీ పరిస్థితి..
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గతేడాది బాగుజోల ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. గిరిశిఖర గ్రామాల్లో ఇకపై డోలీమోతలు ఉండకూదని, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రూ.12కోటు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మక్కువ మండలంలోని బాగుజోల నుంచి చెలకమెండంగి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.2.75కోట్లు, చెలకమెండంగి నుంచి శిరివర గ్రామం వరకు ఆరు కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 9.25కోట్లు మంజూరయ్యాయి. ఆ వెంటనే పార్వతీపురం ఐటీడీఏ అధికారులు టెండర్లు పిలిచి ఏడాది కాలంగా పనులు చేపడుతున్నారు. అయితే ఇంతవరకు కనీసం 30శాతం పనులు కూడా పూర్తికాలేదు, పైగా చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపం, అక్రమాలు చోటుచేసుకొని అనతికాలంలోనే పాడయ్యాయి. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రోడ్లు కోతకు గురై కొట్టుకుపోయాయి. నాసిరకం మెటల్, జీఎస్పీ వాడటంతోపాటు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభించకముందే సీసీ రోడ్డు బీటలు వారి శిథిలావస్థకు చేరుకుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. బాగుజోల నుంచి శిరివర వరకు మొత్తం ఘాట్ రోడ్డు కావడంతో రెండు వైపులా బెర్ములు నిర్మించి ఉంటే రోడ్డు కోతకు గురయ్యేది కాదని గిరిజనులు అంటున్నారు. పనులను పూర్తిగా కాంట్రాక్టర్‌పైనే వదిలేయడంతో నాణ్యత లోపించి కురిసిన కొద్దిపాటి వర్షానికే జీఎస్పీ అంతా కొట్టుకుపోయి రోడ్డంతా గోతులు మయమైందని ఆవేదన చెందుతున్నారు. చెలకమెండంగి-శిరివర రోడ్డు పనులను కాంట్రాక్టర్ గత మూడు నెలలుగా నిలిపివేశాడు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఏఈ శంకరరావును వివరణ కోరగా.. ‘రోడ్డు పాడైన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఆగిపోయిన పనులను తొందరలోనే తిరిగి ప్రారంభిస్తాం.’ అని తెలిపారు. బాగుజోల -చెలకమెండంగి రోడ్డు విషయమై ఐటీడీఏ ఈఈ మణిరాజును వివరణ కోరగా .. వర్షాలకు కోతకు గురైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.