Share News

జిందాల్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకు కదలిక వచ్చినట్టేనా? పరిశ్రమల శాఖ కార్యదర్శి పర్యటన

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:06 AM

Is there finally some movement? శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికుల్లో నిరాశ ఉంది. ఇటు పరిహారం అందక నిర్వాసితుల్లోనూ అయోమయం నెలకొంది. ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న కడప జిల్లా నుంచి వర్చువల్‌గా భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.

జిందాల్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకు కదలిక వచ్చినట్టేనా? పరిశ్రమల శాఖ కార్యదర్శి పర్యటన
జెఎస్‌డబ్ల్యూ (జిందాల్‌) ఇండస్ట్రీయల్‌ పార్కు ప్రతినిధులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ (ఫైల్‌)

కదలిక వచ్చినట్టేనా?

జిందాల్‌ పార్కు భూములను తాజాగా సందర్శించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌

ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచన

ఎంఎస్‌ఎంఈ ఒప్పందాలు బయటకు తెలియకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు

ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో నిర్వాసిత రైతుల్లోనూ నిరాశ

- పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి, ఆర్ధికాభివృద్ధికి ఊతమిచ్చేలా చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రభుత్వం, జెఎస్‌డబ్ల్యూ యాజమాన్యం సమన్వయంతో పని చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, రహదారులు, విద్యుత్‌, నీటి వసతి వంటి మౌలిక వసతుల కల్పనపై యాజమాన్యం దృష్టిసారించాలి

- జెఎస్‌డబ్ల్యూ (జిందాల్‌) ఇండస్ట్రీయల్‌ పార్కు ప్రతినిధులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ చెప్పిన మాటలు

శృంగవరపుకోట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికుల్లో నిరాశ ఉంది. ఇటు పరిహారం అందక నిర్వాసితుల్లోనూ అయోమయం నెలకొంది. ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న కడప జిల్లా నుంచి వర్చువల్‌గా భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే యాజమాన్యం ఈ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్మాణానికి వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. యాజమాన్యం కూడా భూమిపూజ సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఇంతవరకు ఈ భూముల్లో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. సోమవారం జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి వచ్చిన ఇండస్ట్రీయల్‌ విభాగం సెక్రటరీ యువరాజ్‌ జిందాల్‌ పారిశ్రామిక పార్కు అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. యాజమాన్య ప్రతినిధి రాచూరి కనకారావుతో చర్చించారు. ఈ పరిణామంతో ఇండిస్ట్రీయల్‌ పార్కు పనులకు కదలిక వచ్చినట్లుందని స్థానికులు ఆశిస్తున్నారు.

జిందాల్‌కు ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, కిల్తంపాలెం రెవెన్యూ గ్రామాలకు చెందిన 1127 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. జిందాల్‌ యాజమాన్యం ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. దీంతో నిర్వాసిత రైతులు తిరిగి భూములను ఇవ్వాలని డిమాండు చేశారు. భూములు తీసుకున్న సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వీరికి మద్దతుగా నిలిచారు. యాజమాన్యం, నిర్వాసిత రైతుల మధ్య నడుస్తున్న వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ముందుకు వచ్చారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి సహకారంతో సమస్యకు పరిష్కారం చూపారు. ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణానికి భూమి ఎంత అవసరమో, రైతు ప్రయోజనాలను నెరవేర్చడం అంతే ముఖ్యమని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అదనపు పరిహారం ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పించారు. వర్చువల్‌ భూమి పూజ సమయంలో కూడా పక్షం రోజుల్లో పరిహారానికి చెందిన సొమ్మును చెక్కుల రూపంలో అందిస్తామని సభాముఖంగా నిర్వాసిత రైతులకు మాట ఇచ్చారు. నెలరోజులు దాటుతున్నా ఆ దిశగా చర్యలు లేవు. దీంతో నిర్వాసిత రైతుల్లో అసహనం గూడుకట్టుకుంది.

- భూమిపూజ సమయంలో వివరించిన వివరాలు తప్ప.. ఆ భూముల్లో ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసేందుకు జిందాల్‌ యాజమాన్యం ఇంతవరకు ఎన్ని స్మాల్‌ ఇండస్ట్రీయల్‌ యాజమాన్యాలతో ఎంఓయూ చేసుకుందో బయటపడడం లేదు. నిరుద్యోగ యువతలోను ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణంపై అనుమానాలు వున్నాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ పర్యటనతో ఏమైనా కదలిక వస్తుందేమోనన్న ఆశ వారిలో కలుగుతోంది.

Updated Date - Aug 12 , 2026 | 10:51 AM