Share News

Is there a problem who is listening? సమస్య వినేవారేరీ?

ABN , Publish Date - May 28 , 2026 | 11:59 PM

Is there a problem who is listening? స్వర్ణ గ్రామంలో కాని స్వర్ణ వార్డులో కాని డిజిటల్‌ అసిస్టెంట్‌ కీలకం. పంచాయతీ డేటా మొత్తం ఆయన వద్దే ఉంటుంది. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకోవాలన్నా, సర్వీసు చార్జీలు వసూలు చేయాలన్నా.. ధ్రువపత్రాలు ప్రింట్‌ ఇవ్వాలన్నా.. డిజిటల్‌ లావాదేవీల్లో ఏదైనా సమస్య వచ్చినా.. ఇ- పంచాయత్‌ సేవలు అందజేయాలన్నా ఆయనే కీలకం.

 Is there a problem who is listening? సమస్య వినేవారేరీ?

సమస్య వినేవారేరీ?

సచివాలయల్లో కీలక పోస్టులు ఖాళీ

చాలా చోట్ల డీఏ లేక ప్రజలకు అవస్థలు

ఇన్‌చార్జిలపై అదనపు భారం

స్వర్ణ గ్రామంలో కాని స్వర్ణ వార్డులో కాని డిజిటల్‌ అసిస్టెంట్‌ కీలకం. పంచాయతీ డేటా మొత్తం ఆయన వద్దే ఉంటుంది. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకోవాలన్నా, సర్వీసు చార్జీలు వసూలు చేయాలన్నా.. ధ్రువపత్రాలు ప్రింట్‌ ఇవ్వాలన్నా.. డిజిటల్‌ లావాదేవీల్లో ఏదైనా సమస్య వచ్చినా.. ఇ- పంచాయత్‌ సేవలు అందజేయాలన్నా ఆయనే కీలకం. కానీ ఈ పోస్టు చాలా కార్యాలయాల్లో ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిగా మిగతా సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే ఆ ఉద్యోగి రెండు పనులు చేయలేకపోతున్నాడు. దీంతో సమస్య చెప్పుకుందామని వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులదీ ఇదే పరిస్థితి.

విజయనగరం కలెక్టరేట్‌, మే 28 (ఆంధ్రజ్యోతి):

- వేపాడ మండలం సింగరాయి స్వర్ణ గ్రామంలో మొత్తం 11 పోస్టులకు 8 మంది మాత్రమే ఉన్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ లేరు. మిలిగిన వారికి ఈ మూడు పోస్టుల బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల వారికి పని భారం పెరగడంతో పాటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

- గంట్యాడ మండలం లక్కిడాం స్వర్ణ గ్రామంలో డిజిటల్‌ అసిస్టెంట్‌(డిఏ) పోస్టుతోపాటు గ్రామ రెవెన్యూ కార్యదర్శి లేరు. డీఏ బాధ్యతలను మహిళా పోలీసుకు అప్పగించారు. ఆమె స్టేషన్‌ డ్యూటీకి వెళ్లినా.. ఇతర పోలీస్‌ విధులకు హాజరైనా, సెలవు పెట్టినా అక్కడ సేవలు ఆగిపోతున్నాయి.

- జామి మండలం అట్టాడ స్వర్ణ గ్రామంలో గ్రామ రెవెన్యూ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఈ బాధ్యతలను వేరే గ్రామ వీఆర్‌వోకి అప్పగించారు. అలాగే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌కు పంపించారు. ఆ బాధ్యతలను మహిళా పోలీస్‌కు అప్పగించారు.

జిల్లాలోని చాలా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. కొందరు ఉన్నత ఉద్యోగాలు సాధించి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన వారున్నారు. ఇంకొందరిని డిప్యూటేషన్‌పై వేరేచోట నియమించారు. ఈ పరిస్ధితిలో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతి కార్యాలయంలో 11 మంది సిబ్బంది ఉండాలి. జిల్లాలో స్వర్ణ గ్రామ 530, స్వర్ణ వార్డు కార్యాలయాలు 96 కలిపి మొత్తం 626 ఉన్నాయి. మొత్తం 6704 పోస్టులు మంజూరు కాగా వాటిల్లో 5666 పోస్టుల్లోనే ఉద్యోగులు ఉన్నారు. 1038 ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా డిజిటిల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. వివిధ పనుల కోసం వచ్చేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డిజిటల్‌ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి ఇవ్వడం వల్ల కూడా డీఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పోస్టులనైనా భర్తీ చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో ఖాళీ పోస్టులు ఇలా

వెటర్నీ అసిస్టెంట్‌లు 382 పోస్టులు మంజూరు కాగా 46 ఖాళీగా ఉన్నాయి. ఏఎన్‌ఎంలు 530కి గాను 143 ఖాళీగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్‌ 407కు గాను 82 ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరు అసిస్టెంట్‌ 530 మంజూరు కాగా 89 ఖాళీ ఉన్నాయి. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి 530 కి గాను 24 ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 1 నుంచి గ్రేడ్‌ 4 వరకూ 481 పోస్టులు మంజూరు కాగా 77 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 5 కింద 282 పోస్టులు మంజూరు కాగా 17 మంది లేరు. ఇక డిజిటల్‌ అసిస్టెంట్‌ 530 పోస్టులు మంజూరు కాగా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ 373 పోస్టులకు గాను 92 ఫిసరీస్‌అసిస్టెంట్‌లు 33కు గాను ఒక పోస్టు, సర్వేయర్‌ 530కి గాను 50, గ్రామ రెవెన్యూ కార్యదర్శి పోస్టులు 530కి గాను 131 ఖాళీగా ఉన్నాయి. అలాగే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ 530కి గాను 44, వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ 96కి గాను 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డు ఎనర్జీ సెక్రటరీ 96 పోస్టులు మంజూరు కాగా 57 ఖాళీగా ఉన్నాయి.

----------------

Updated Date - May 28 , 2026 | 11:59 PM