Flooding Over? ముంపు ముప్పు తప్పేనా?
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:29 PM
Is the Threat of Flooding Over? వర్షం కురిస్తే చాలు జిల్లాకేంద్రంలోని శివారు ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కాలనీల్లో ఎక్కడికక్కడ వర్షపునీరు నిలిచిపోతుండడంతో వారికి ముంపు సమస్య తప్పడం లేదు. వరద నీటిలోనే రెండు, మూడు రోజుల పాటు ఉండాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనే కాదు.. అక్టోబరు, నవంబరు నెలల్లో ఏర్పడే తుపాన్ల సమయంలోనూ వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
కొన్నేళ్లుగా జిల్లాకేంద్రవాసులకు తప్పని ఇబ్బందులు
వరదనీటి మళ్లింపునకు చర్యలు శూన్యం
నూతన పాలకవర్గంపై ఆశలు
పార్వతీపురం టౌన్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి) : వర్షం కురిస్తే చాలు జిల్లాకేంద్రంలోని శివారు ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కాలనీల్లో ఎక్కడికక్కడ వర్షపునీరు నిలిచిపోతుండడంతో వారికి ముంపు సమస్య తప్పడం లేదు. వరద నీటిలోనే రెండు, మూడు రోజుల పాటు ఉండాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనే కాదు.. అక్టోబరు, నవంబరు నెలల్లో ఏర్పడే తుపాన్ల సమయంలోనూ వారికి ఇక్కట్లు తప్పడం లేదు. గత పదేళ్లుగా పట్టణ నడిబొడ్డుతోపాటు శివారు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వరదనీటిని మళ్లించాలని ఏటా వర్షాకాలంలో ఆయా ప్రాంతవాసులు అధికారులను వేడు కుంటున్నా.. ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పలక రింపులే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడం లేదని ‘పుర’ వాసులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పట్టణంలో 36 వార్డులున్నాయి. 70 వేలకు మించి జనాభా ఉంటున్నారు. అయితే పట్టణ నడిబొడ్డుతో పాటు శివారు కాలనీలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మౌలిక వసతులకు దూరంగానే ఉన్నాయి. కనీసం రహదారులు, కాలువల వంటి నిర్మాణం కూడా జరగడం లేదు. సుమారు 35 ఏళ్ల కిందట ఏర్పాటైన బైపాస్ కాలనీతో పాటు శత్రుచర్ల రియల్ ఎస్టేట్ కాలనీలోని గణేష్ నగర్, తదితర ప్రాంతాల్లో రహదారులు, కాలువలు లేవు. దీంతో వర్షం పడిన ప్రతిసారీ ఆయా కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనశక్తి, రామాపురం కాలనీవాసులు సైతం గత 15 ఏళ్లుగా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు.
- లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో వరదనీటి మళ్లింపునకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు చెప్పినా.. పనులేవీ జరగలేదు. మరోవైపు మున్సిపల్ ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులు.. వరదనీటి మళ్లింపుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ సమస్యపై ప్రభుత్వం, మున్సిపల్ నూతన పాలకవర్గ సభ్యులు దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఏటా ముంపు
వర్షాలో జోరుగా కురిస్తే.. మా కాలనీ మునిగిపోతుంది. వరదనీటిలో సుమారు రెండు రోజులు ఉండాల్సిన దుస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులు పలకరింపులే తప్ప వరదనీటిని మళ్లించేందుకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.
- శ్రీనివాసరావు, బైపాస్ కాలనీ, పార్వతీపురం
===============================
కాలువలు లేక ఇబ్బందులు
మా కాలనీల్లో వరదనీటిని మళ్లించాలని ఏటా వర్షాకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఎన్నో ఏళ్ల కిందట ఏర్పడిన కాలనీల్లో సరైన కాలువలు లేవు. దీంతో ఏటా ముంపుతో ఇబ్బందులపాలవుతున్నాం. ఇప్పటికైనా నూతన పాలకవర్గం స్పందించి వరదనీటి మళ్లింపునకు చర్యలు చేపట్టాలి.
- పి.రామకృష్ణ, గణేష్‌నగర్ కాలనీ, పార్వతీపురం
==============================
ప్రతిపాదనలు సిద్ధం చేశాం..
పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరదనీటిని మళ్లించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖాధికారుల సహకారంతో కాలువల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తాం.
-రామ్ గోపాల్, కమిషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ